వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌కి ఓ అగ్ని పరీక్ష పెట్టారు… ఈ టెస్ట్‌లో అవినాష్ రెడ్డి ఓడిపోవాలని సొంత పార్టీలోని నేతలే కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది… అప్పుడే జగన్‌కి ఎవరి విలువ ఏంటో తెలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.. ఈ దిశగా పావులు కూడా కదుపుతున్నారని సమాచారం..
ఇంతకీ ఆ పరీక్ష ఏంటంటే.. పులివెందుల జడ్పీటీసీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.. ఇక, కడప పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి సైతం ఉప ఎన్నిక జరగనుంది.. ఈ రెండు స్థానాలలో గెలిచి జగన్‌కి సొంత నియోజకవర్గంతోపాటు ఆయన తన కంచుకోటగా భావించే కడప గడ్డపైనా ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ.. ఇప్పటికే ఈ బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు..
వరస అవినీతి కేసులు బయటపడడం, ఇటు, పార్టీ నేతలు అక్రమాస్తులు, అవినీతి, క్రిమినల్ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్నారు.. ఇదే వైసీపీని మానసికంగా దెబ్బతీసింది.. లిక్కర్ స్కామ్‌లో వెలుగు చూస్తున్న పదుల సంఖ్యలో నోట్ల కట్టలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ అరెస్ట్ ఖాయం అంటూ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులని బెంబేలెత్తేలా చేస్తున్నాయి.. తాజాగా హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌజ్‌లో బయటపడిన 11 కోట్ల రూపాయలతోపాటు నోట్ల కట్టలతో వైరల్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక అనుచరుడు వెంకటేష్ నాయుడు వీడియోతో జగన్ టీమ్ రాష్ట్రంలో ఎంతటి అరాచకం చేసిందో కళ్లకు కడుతోంది.. ఈ పరిణామాలు కడప ప్రజల ఆలోచనలను మారుస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు..
మరోవైపు, ఎన్నికల తర్వాత కూడా జగన్.. తన తల్లిని, సోదరిని దగ్గరకు తీసుకోకపోవడం, వారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుండడం కూడా వైసీపీకి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది.. ఈ భావనతోనే జగన్ ఫ్యామిలీకి చెందిన కొందరు బంధువులు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కుతున్నారు.. ఎన్టీఆర్ భవన్ గూటికి చేరుకుంటున్నారు.. జగన్‌పై నమ్మకం, విశ్వాసం చెదిరిపోయిందని…. ఇదే త్వరలో జరగబోయే జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీని చావు దెబ్బ కొట్టనుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు..
అవినాష్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కొందరు వైసీపీ నేతలు, ఆయనకు ఝలక్ ఇవ్వాలంటే ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు.. జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతను జగన్…. స్వయంగా అవినాష్ రెడ్డికి అప్పగించారు.. ఈ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోయారంటే, అది అవినాష్ రెడ్డి ఓటమిగానే భావించవలసి ఉంటుందని స్థానిక వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు.. దీంతో, అవినాష్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారట.. మొత్తమ్మీద, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జగన్‌తోపాటు అవినాష్ రెడ్డికి విషమ పరీక్షగా మారుతున్నాయి.. మరి, దీని నుండి ఆ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి..











