వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ సీఐడీ డీజీ సునిల్ కుమార్‌పై ధిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తన ఐ ఫోన్‌ను మెజిస్ట్రేట్‌కు అప్పగించాలని పేర్కొంటూ లీగల్ నోటీసు ఇచ్చిన రఘురామకృష్ణరాజు తాజాగా తన ఐ ఫోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ విభాగం తన వద్ద ఉంచుకుందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ధిల్లీ పోలీసు విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పార్లమెంట్ స్ట్రీట్ )కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం..
‘ ఏపీలోని నర్సాపురం నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడినైన తాను మే 14న తన ఇంట్లో ఉండగా తనను ఏపీ సీఐడీ విభాగం నిబంధనలను అతిక్రమించి అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని తన నివాసంలో ఉండగా ఏపీ సీఐడీ డీజీ పీవీ సునిల్ కుమార్ ఆధ్వర్యంలోని సీఐడీ విభాగం పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నా భార్య, కుమారుడి సమక్షంలో నా సెల్ ఫోన్, మోడల్ ఐ ఫోన్ 11, సిమ్ నెంబరు 9000922222, వాట్సాప్ నెంబరు 9000911111ను స్వాధీనం చేసుకున్నారు. అయిత ఈ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపెట్టలేదు. దీనిపై ఇప్పటికే నేను జూన్ 4న సీఐడీ అడిషనల్ డీజీ సునిల్ కుమార్‌కి లీగల్ నోటీసు పంపించాను.
అయితే మే 14న తేదీన నన్ను అరెస్టు చేసిన తరవాత పీవీ సునిల్ కుమార్‌తో పాటు మరో నలుగురు తనపై దాడి చేశారు. బలవంతంగా ఐ ఫోన్‌ను అన్ లాక్ చేసేందుకు యత్నించారు. బౌతిక దాడి చేశారు. అందులో ఒకరు విచక్షణా రహితంగా దాడి చేయడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు నేను నా ఐ ఫోన్‌ను అన్ లాక్ చేశాను. తరువాత సీఐడీ సమర్పించిన నివేదికల్లో నా ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చూపలేదు. ఈ నేపథ్యంలో జులై 5న నా ట్విట్టర్ ఐడీ @RaghuRaju_MP ద్వారా మాజీ ఐఏఎస్ అధికారి, వైద్యుడైన పీవీ రమేష్ ఓ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. నా వాట్సాప్ నెంబరుతో ఆయనకు మెస్సేజ్ లు వెళ్లినట్టు చెప్పారు. ఓ బాధ్యత గల వ్యక్తిగా నేను స్పందించాను. నాలుగు రోజుల క్రితం ఆ సిమ్ కార్డును బ్లాక్ చేయించి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను. మే 14నుంచి జూన్ 1వరకు నేను ఎవరికీ ఎలాంటి మెస్సేజ్ లూ పంపలేదు. నా ఫోన్‌ను ఏపీ సీఐడీ విభాగం మే 14న సీజ్ చేసిందని, ఇప్పటికీ ఆ ఫోన్ వారివద్దే ఉందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బదులిచ్చాను. అయితే పీవీ సునిల్ కుమార్‌కి, పీవీ రమేష్ సంబంధీకులకు మధ్య ఉన్న విభేదాలు, సంబంధాల నేపథ్యంలో తన ఫోన్ ద్వారా పీవీ రమేష్ కుమార్‌కు మెస్సెజ్ లు వెళ్లినట్టు అనుమానాలున్నాయి. వీరి మధ్య ఉన్న విబేధాలకు సంబంధించి కొన్ని కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అరెస్టు సమయంలో తన నుంచి స్వాధీనం చేసుకుని చట్ట విరుద్ధంగా తన వద్ద ఉంచుకున్న సునీల్ కుమార్ నా ఫోన్‌ను దుర్వియోగిం చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. దీనిపై విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతే కాకుండా ప్రైవసీ, వ్యక్తిగత భద్రత, ప్రజాప్రతినిధుల చట్టం తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలను కూడా అతిక్రమించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ’అని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Must Read ;- టీవీ9 ప్రసారం చేసిన కథనాలు.. పరువు నష్టం చేశారంటూ రఘురామ లీగల్ నోటీస్














