వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు సీఎం జగన్ పై లేఖల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్పందన ఎలా ఉన్నా.. లేఖలు రాయడం మాత్రమే ఆపడం లేదు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సూటిగా ప్రశ్నిస్తూ పలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. వాటిని పరిష్కరించే దిశగా లేఖలు సంధిస్తున్నారు. తాజాగా సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో రఘురామ లేఖ రాశారు. కరోనా దృష్ట్యా పరీక్షల రద్దుపై ఉన్నతస్థాయి అధికారులతో చర్చించి.. ఈనెల 1న ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకే మోడీ నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు.
ఏపీలో రివర్స్ గేర్
ఏపీలోపాటు అన్ని రాష్ర్టాల్లో కొవిడ్ ప్రభావం ఉందని, పిల్లల క్షేమం కోసమే పరీక్షలు రద్దు చేశాయని అన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షల రద్దు చేసినట్టుగా.. ఏపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా తక్షణం నిర్ణయం తీసుకోవాలని, ఇరోజు ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలపాలని రఘురామరాజు డిమాండ్ చేశారు.
ఒక్కరు మరణించినా.. ప్రభుత్వానిదే బాధ్యత
ఇంటర్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పటంతో అంతటా విమర్శలొస్తున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం మండిపడుతున్నారు. పరీక్షల కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టాలని అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై హోకోర్టు కూడా మొట్టికాయలు వేసినా జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరీక్షల కారణంగా ఒక్కరు మరణించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. ఇంటర్ పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి.. ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసింది. పరీక్షలపై నిర్ణయం తీసుకుని.. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Must Read ;- పేదల జగనన్న ఇళ్లు త్వరగా పూర్తి చేయండి : ఎంపీ రఘురామరాజు లేఖ