Bhuma Family Is In Trouble Because Of Bhargav Ram :
తెలుగు నేల రాజకీయాల్లో భూమా ఫ్యామిలీది ఓ ప్రత్యేకత. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఈ ఫ్యామిలీకి మాత్రమే దక్కిందని చెప్పాలి. భర్త ఎంపీగా ఉన్న సమయంలో భార్య ఎమ్మెల్యేగా కొనసాగిన ఘనత కూడా ఈ ఫ్యామిలీకి దక్కింది. అంతేనా.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్ పర్సన్ గా ఓ మహిళ కొనసాగిన అరుదైన రికార్డు కూడా ఈ ఫ్యామిలీ పేరిటే ఉంది. పార్టీలు మారినా.. తమ ప్రాంతంపై పట్టు కోల్పోకుండా సాగడం కూడా ఈ ఫ్యామిలీకి మాత్రమే దక్కింది. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన భూమా ఫ్యామిలీ ప్రతిష్ఠ ఇప్పుడు కొడిగట్టిపోతోంది. రోడ్డు ప్రమాదంలో భార్య, ఆ తర్వాత గుండెపోటుతో భర్త చనిపోగా.. అప్పటిదాకా రాజకీయాలంటే పెద్దగా తెలియని ముగ్గురు పిల్లలు తమ ఫ్యామిలీ పరువును కాపాడుకునేందుకు చేసిన యత్నాలు ఒకే ఒక్క వ్యక్తి కారణంగా నిష్ఫలమైపోయాయని చెప్పాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు.. భూమా దంపతుల పెద్ద కుమార్తె, మాజీ మంత్రి అఖిలప్రియను వివాహం చేసుకున్న భార్గవ్ రామ్. భార్గవ్ అత్యుత్సాహం కారణంగా ఇప్పుడు అతడితో పాటు భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా పరారీలో ఉండాల్సిన దుస్థితి వచ్చింది.
టీడీపీతోనే ఓనమాలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులు కర్నూలు జిల్లా రాజకీయాల్లో తిరుగు లేని నేతలుగా ఎదిగారు. యుక్త వయసులోనే భూమా నాగిరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వా శోభా నాగిరెడ్డి కూడా రాజకీయాల్లో రాణించారు. తెలుగు దేశం పార్టీ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన భూమా దంపతులు పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. పార్టీ కూడా వారికి మంచి గుర్తింపే ఇచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి వైసీపీలో ఉన్న భూమా దంపతులు.. ఆళ్లగడ్డ నుంచి శోభ, నంద్యాల నుంచి నాగిరెడ్డి బరిలోకి దిగారు. అయితే ఎన్నికలు జరిగేలోగానే.. రోడ్డు ప్రమాదంలో శోభ మృతి చెందారు. అయితే అప్పటికే ఎన్నికలకు అంతా సిద్ధం కాగా.. మృతి చెందినప్పటికీ శోభ పేరుతోనే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో శోభ గెలిచారు. నంద్యాలలో నాగిరెడ్డి కూడా గెలిచారు. ఆ తర్వాత ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక జరగ్గా.. భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా ఫ్యామిలీ తిరిగి తమ సొంత గూడు టీడీపీలోకి చేరిపోయింది. నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం కాగా.. ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయనకు ఇవ్వాలనుకున్న మంత్రి పదవిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. ఆయన కుమార్తె అఖిలప్రియకు ఇచ్చి ఆ ఫ్యామిలీకి మరింత ప్రాధాన్యం ఇచ్చారు.
భార్గవ్ ఎంట్రీతో ఇబ్బందులు
మంత్రిగా ఉన్న సమయంలోనే భార్గవ్ రామ్ అనే వ్యక్తిని అఖిలప్రియ వివాహం చేసుకున్నారు. అప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన అఖిల, ఆమె సోదరి, సోదరుల బాధ్యతలను తీసుకోవాల్సిన భార్గవ్ రామ్.. వారిని పెడ దోవ పట్టించాడు. భూమా నాగిరెడ్డి బతికి ఉండగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకుంటే.. అఖిలతో పాటు ఆమె సోదరి, సోదరులకు ఇబ్బందే లేకుండా ఉండేది. అయితే భార్గవ్ రామ్ అత్యాశ ఆ ముగ్గురిని ప్రమాదంలో పడేసింది. హైదరాబాద్ లో భూకబ్జా, కిడ్నాప్ లకు తెర తీసిన భార్గవ్ రామ్.. తన బావమరిది జగత్ విఖ్యాత్ రెడ్డిని కూడా రంగంలోకి దించేశాడు. అయితే రాజకీయాల్లో గానీ, ఇతరత్రా వ్యవహారాల్లో గానీ అంతగా అనుభవం లేని జగత్.. భార్గవ్ రామ్ చెప్పినట్టుగా నడుచుకుని బుక్కైపోయాడు. ఇప్పుడు బావతో పాటు జగత్ కూడా పరారీలో ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాస్తంత వ్యూహాత్మకంగా, ఆచితూచి అడుగులు వేయాల్సిన అఖిల.. తెలంగాణ సర్కారుతో ఢీ అంటే ఢీ అనే రీతిలో సాగుతున్న వైనం ఆశ్చర్యపరిచేదేనని చెప్పక తప్పదు. తాను ఇంటిలో లేని సమయంలో తెలంగాణ పోలీసులు తన ఇంటిలో సోదాల పేరిట పలు కీలక పత్రాలతో పాటు ఆస్తి పత్రాలను తీసుకెళ్లారంటూ ఫిర్యాదు చేశారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- గంగుల వర్సెస్ గంగుల!.. భూమాకు ప్లస్సేగా!