తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వార్తలు రావడంతో రజినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క తమిళనాడు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షాతో ఆయన చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీ భాజాపాతో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ జ్వరంతో బాధ పడుతున్నారన్న వార్తలను రజినీ ప్రతినిధి రియాజ్ ఖండించారు.
Also Read:-అభిమానులకు తలైవా రజినీ దీపావళి శుభాకాంక్షలు

ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన వివరించారు. ఓ టీవీ ఛానెల్ ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నెలలో హైదరాబాద్ ప్రారంభం కావాల్సి ఉన్న ఆయన తాజా సినిమా అన్నాత్తే షూటింగ్ కూడా ఇంకా మొదలవ లేదు. ఇదిగో అదిగో అంటూ వాయిదాలు పడుతూ రావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది.
తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి వద్దని వైద్యులు సూచించారని రజినీ ఆమధ్య పేర్కొన్నారు. దాంతో ఆయన రాజకీయ పార్టీ విషయంలో అనిశ్చితి ఏర్పడింది. కరోనా దృష్ట్యా ఆయన తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఆయన కలంబక్కంలోని తన ఫామ్ హౌస్ లో గడుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది.











