కలియుగ దానకర్ణుడిగా పేరుతెచ్చుకున్న నటుడు సోనూ సూద్ ను రామినేని ఫౌండేషన్ పురస్కారం వరించింది. కరోనా కాలంలో అనేక మంది వలస కూలీలకు బాసటగా నిలవడంతోపాటు ఇంకా అనేకమందికి అనేక రకాలుగా సాయం అందిస్తున్న సోనూసూద్ సేవలను రామినేని ఫౌండేషన్ గుర్తించింది. అందుకోసం ప్రత్యేక పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. ఈ పురస్కారం పొందిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
అయితే తనకు లభించే నగదును కూడా మరొకరి సాయానికి ఉపయోగించనున్నారు సోనూ సూద్. అదీ ఆయన ఉదారత. ఈ నగదును హైదరాబాద్‌లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడి శస్త్ర చికిత్సకు ఉపయోగించాలని సోనూసూద్ కోరినట్లు తెలిసింది. ఈ పురస్కారాలను డిసెంబరు లేదా జనవరిలో ఆయనకు అందజేయనున్నారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ చైౖర్మన్ ధర్మప్రచారక్ తెలిపారు.