టాలీవుడ్ యువ హీరో నితిన్ చాలా కాలం గ్యాప్ తర్వాత ‘బీష్మ’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి, నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘బీష్మ’ సినిమా తర్వాత నితిన్ నటించిన తాజా చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మే నెలలోనే పూర్తి కావాల్సింది. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
తిరిగి ఈమధ్యనే ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. అసలు ‘రంగ్ దే’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. ఆ విధంగానే ‘రంగ్ దే’ సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి. అయితే నితిన్ సూచనలతో సినిమాను సంక్రాంతి కంటే ముందుగానే నిర్మాతలు రిలీజ్ చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
ఈ డిసెంబర్ నెలలోనే అంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారని టాక్. సంక్రాంతి బరిలో అనేక పెద్ద సినిమాలు ఉంటాయని అందుకనే ‘రంగ్ దే’ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని నితిన్ నిర్మాతలకు సలహా ఇచ్చాడని తెలుస్తోంది. ‘రంగ్ దే’ సినిమాకు సంబంధిన ప్రమోషన్స్ కూడా త్వరలోనే మొదలవుతాయని సమాచారం.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాపై కూడా నితిన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బీష్మ’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన తమ అభిమాన హీరో ‘రంగ్ దే’ సినిమాతో కూడా మరొక మంచి హిట్ సాధించాలని వారు కోరుకుంటున్నారు. అనుకున్న డేట్ కన్నా ముందుగానే వస్తున్న ‘రంగ్ దే’ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.