ప్రశాంత్ కిషోర్..ఈ పేరు రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా తెలుసు. గతంలో Modi, BJP, YCP, AAP, JDU లకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. YSRCPని APలో అధికారంలోకి తెచ్చారు. ఇప్పటికీ ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ కు సంబంధాలున్నాయి. అయితే రానున్న కాలంలో ఆ సంబంధాలు కొనసాగుతాయా..లేదా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. బీజేపీతో ఎంత దగ్గరగా ఉండాలంటే.. ప్రశాంత్ కిషోర్ తో అంత దూరం జరగాల్సి ఉంటుందన్న చర్చ మొదలైంది.
నిన్న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేసిన సందర్భంగా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్ మరి కొన్ని రోజుల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్న సంకేతం కూడా ఇస్తోందనే అనే చర్చ మొదలైంది. బీహార్ లో 243 సీట్లకు గాను 125 సీట్లలో ఎన్డీయే కూటమి గెలిచింది. తొలుత నితీష్ కుమార్, 74 సీట్లు గెలిచిన బీజేపీనే సీఎం సీటును తీసుకోవాలని ప్రతిపాదించినా..బీజేపీ మాత్రం తన భాగస్వామి, 43 సీట్లు గెలిచిన (JDU) నితీష్ కుమార్ కే పట్టం గట్టింది.
ట్వీట్ తో ఎద్దేవా..బీజేపీకి కాలేలా..
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నామినేట్ చేసిన బీహార్ CM నితీశ్ కు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. CMగా సుదీర్ఘకాలం పనిచేసి బాగా అలసిపోయిన, రాజకీయంగా వెనుకబడినా నేత నితీష్ పేలవమైన పాలనను బీహార్ ప్రజలు కొన్నేళ్లపాటు చూడబోతున్నారు” అని ట్వీట్ చేశాడు. ఇందుకు కారణం కూడా ఉంది. 2015 ఎన్నికల సమయంలో జేడీయూకి ప్రశాంత్ కిషోర్ చాలా దగ్గరయ్యారు. ఒక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ను తన వారసుడిగా నితీష్ ప్రకటించారు. తరువాతి కాలంలో కేంద్రం తీసుకొచ్చిన CAA బిల్లుపై ప్రశాంత్ కిషోర్ వ్యతిరేక కామెంట్లు చేయడంతో ఆయనను పార్టీనుంచి బహిష్కరించారు నితీష్ కుమార్ . అప్పటినుంచి ఆయన ఆ పార్టీతో తెరపైన దూరంగానే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ సొంతరాష్ట్రమైన బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నా..నాలుగు నెలల్లో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అసలు ఎలాంటి రాజకీయ జోక్యం ఉన్నట్లూ బయటకు కనిపించలేదు. రిజల్ట్ వచ్చాక..ఆయన ట్వీట్ చేశాడు. అందులోనూ ఆయన చాలా ఎద్దేవా చేసినట్టు ఉంది. అంతేకాదు.. ఈ ట్వీట్ లో నితీష్ కుమార్ కంటే.. బీజేపీకి విమర్శించినట్టు కనిపిస్తోందనే చర్చ మొదలైంది.
Must Read: బీహార్ ఎన్నికల్లో బీజేపీ కుట్రకు ఎల్జేపీ బలైందా?
మోదీతో మొదలై..ఆయనకు వ్యతిరేకంగా
2012లో మోదీని మూడోసారి గుజరాత్ సీఎం చేసేందుకు, 2014లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ వర్క్ చేశారు. 2015లో నితీష్ కుమార్ కు వర్క్ చేశారు. తరువాతి కాలంలో ఆయన యాంటీ బీజేపీ పార్టీలకు పనిచేయడం ప్రారంభించారు. అంతకుముందు ఏఏపీకి కూడా మౌఖిక సలహాదారుగా చేశాన్న ప్రచారం జరిగింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. 2020లో ధిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశాడు. గత ఏప్రిల్ నుంచి పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ తరఫున రాజకీయవ్యూహాలు అమలుచేయడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ టైంలోనే.. అంటే గత ఏప్రిల్ లో మమత బెనర్జీనుంచి అత్యవసర పిలుపు రావడంతో ఆయన కార్గో విమానంలో..కొందరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కలసి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. లాక్ డౌన్ సమయంలో కేంద్రంపై మమత చేసిన ఘాటైన విమర్శల వెనుక..ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందని చెబుతారు.
జగన్ కు ఇబ్బందే..
2016వరకు ప్రశాంత్ కిషోర్ బీజేపీ సపోర్టెడ్ పార్టీలకు పనిచేసినా.. తరువాత వరుగా బీజేపీయేతర, బీజేపీ వ్యతిరేక పార్టీలకు పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ప్రశాంత్ కిషోర్ సహకారంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీతో కాస్త వెనకాముందు ఆలోచించి వెళ్తున్నా..పశ్చిమ బంగాలో మాత్రం మమత కేంద్రానికి మింగుడు పడడం లేదు. అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఎలాగైనా..పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమబంగాలో బీజేపీ 19 స్థానాలు గెలవడంతో కంగుతిన్న మమత బెనర్జీ ప్రతివ్యూహాలు అమలుచేస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ ను ఆహ్వానించారు. 2021లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి రాష్ట్రం లోపుంజుకోకుండా చేయడమే కాదు.. బీజేపీని రాష్ట్రంనుంచి వెళ్లగొట్టాలని మమత ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీకి మమతకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చాక కూడా.. ప్రశాంత్ కిషోర్ లో వైసీపీ టచ్ లోనే ఉంది. రానున్న కాలంలోనూ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నే కొనసాగించే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో పశ్చిమబంగా ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టార్గెట్ ప్రశాంత్ కిషోర్ తోపాటు ఆయన వ్యూహకర్తగా ఉన్న పార్టీలూ కావచ్చనే అంచనా మొదలైంది. ప్రశాంత్ కిషోర్ తో ఎంత దగ్గరగా ఉంటే.. బీజేపీ అదే స్థాయిలో వ్యతిరేకం అవుతుందన్న చర్చ నడుస్తోంది. మరి ఏపీ లో వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.
Also Read: వైసీపీలో కుమ్ములాటలు, రోడ్డున పడుతున్న ఫ్యాను పరువు ..!