ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. స్థానిక ఎన్నికలను తాము నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం చేసేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని కూడా చెప్పేశారు. అప్పటికి కరోనా ఉధృతి ఇంకా తగ్గుతుందని కూడా ఆయన అన్నారు. పైగా స్థానిక ఎన్నికలను దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించే వాతావరణం వచ్చేసిందని, తెలంగాణలో కూడా జరుగుతోందని ప్రకటించారు. కోర్టునుంచి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చేశాక- ఆయన ముందుకు దూసుకువెళ్లడంలో వింతేమీ లేదు.
అయితే ఎప్పుడో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచి కంగారు పడుతోంది. ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది. ఇంకా ఆయనకు తెలుగుదేశంతో అక్రమ సంబంధాలు అంటగట్టడానికి ప్రయత్నిస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. చంద్రబాబునాయుడకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ.. ఇవాళ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారు, పార్టీ రాజకీయ వ్యూహరచనలో నిత్యం బిజీగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం విశేషం.
Must Read: జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
ఎందుకింత భయం..
మార్చి నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. స్థానిక ఎన్నికల పట్ల మహోత్సాహంతో ఉంది. కరోనా భయంతో ఆయన వాయిదా వేయగానే.. జగన్ ఆగ్రహోదగ్రులయ్యారు. నిప్పులు చెరిగారు. కానీ.. జగన్ ఆలోచనకు భిన్నంగా.. కరోనా ప్రబలింది. దేశం మొత్తం స్తంభించిపోయింది. ఇప్పుడు నిజంగానే కరోనా తగ్గుముఖం పడుతోంది. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. దాదాపుగా అన్ని రకాల విషయంలోనూ.. కరోనాతో సహజీవనం చేసి తీరాల్సిందే.. అని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఇంత జరుగుతుండగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు మాత్రం వారు ఎందుకంత కంగారు పడుతున్నారు?
ప్రభుత్వం పట్ల రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అనల్పమైన వ్యతిరేకత ప్రబలిందనే భయం ప్రభుత్వానికి మొదలైందా? లేదా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా.. స్థానిక ఎన్నికల్లో తమ ఆటలు సాగవని వారు జంకుతున్నారా? అనేది ప్రజల్లో కలుగుతున్న మీమాంస.
సంక్షేమ పథకాలు, ప్రజలకు డబ్బు పంచి పెట్టడం మాత్రమే ఓట్లు వేయిస్తాయి అనుకుంటే గనుక.. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ఇప్పటికీ దూసుకుపోతూనే ఉన్నారు. ఇవాళ రైతులకు పంచిపెట్టిన వడ్డీ డబ్బులు కూడా ఓట్లు వేయించేవే. పైగా ఫిబ్రవరిలో ఎన్నికలు అని అంటున్న రమేశ్ కుమార్.. తేదీకి నెల ముందునుంచి మాత్రమే కోడ్ అమల్లోకి వస్తుందని కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఇంకో రెండునెలల వరకు సమయం ఉంది. ఈలోగా పల్లెలకోసం బోలెడన్ని సంక్షేమపథకాలు ప్రకటించవచ్చు. ఆరకంగా జనాన్ని ఆకట్టుకోవచ్చు. ఇంత వెసులుబాటు ఉండగా.. ఇప్పటికీ.. ఎన్నికలను వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేదే అర్థం కాని సంగతి. ప్రభుత్వ అధికారుల సంసిద్ధత లేకుండా.. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎందుకు అంటున్నారనేది అర్థం కావడం లేదు. ఒక హద్దు వరకు ఎన్నికలను వ్యతిరేకిస్తే.. నిమ్మగడ్డ అంటే జగన్ కు ద్వేషం అని ప్రజలు సర్దుకోగలరు.. అంతకంటె ఎక్కువ వ్యతిరేకిస్తే.. ఎన్నికలంటే ముఖ్యమంత్రికి భయం అని ప్రజలు అనుకుంటుారు. ఆ పరిస్థితి వారు తెచ్చుకోకపోవడమే మంచిది.