ఏపీలో రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభించడంతో ఏపీలోని 29 వేల మంది రేషన్ డీలర్లు నాన్ పీడీఎఫ్ ఆదాయం కోల్పోయారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అవుతున్నారు. డీలర్లకు ఇవ్వాల్సిన కమిషన్ చెల్లింపులు కూడా ప్రభుత్వం నిలిపివేయడంతో రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. అనుసరించాల్సిన ఆందోళన వ్యూహాలపై రేషన్ డీలర్లు విజయవాడలో సమావేశమై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. త్వరలో ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నట్టు రేషన్ డీలర్లు ప్రకటించారు.
ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకం
రేషన్ డీలర్లకు పీడీఎఫ్ బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ చెల్లిస్తున్నాయి. డీలర్లు సరఫరా చేసే బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు అమ్మినప్పుడు వారికి అదనంగా కొంత ఆదాయం చేకూరుతోంది. ఇంటింటికి రేషన్ ప్రారంభించడంతో ఏపీలో 29 వేల మంది డీలర్లు మూడు నెలల కాలంలో రూ.200 కోట్ల నాన్ పీడీఎఫ్ ఆదాయం కోల్పోయారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు షాపు అద్దెలు చెల్లించడం కూడా కష్టంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆరు నెలలుగా రావాల్సిన రూ.180 కోట్ల కమిషన్ కూడా చెల్లించకుండా నిలిపి వేశారని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కమిషన్ విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.
కోర్టును ఆశ్రయిస్తాం..
రేషన్ డీలర్లకు సరైన ఆదాయం చేకూరేలా ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు ఉన్నాయని, రేషన్ డీలర్లు కుటుంబ పోషణకు సరపడా ఆదాయం వచ్చేలా చట్టంలో రక్షణ కల్పించినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. దీనిపై త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నట్టు వారు వెల్లడించారు. పీడీఎఫ్ కమిషన్ తోపాటు నాన్ పీడీఎఫ్ ఆదాయం ద్వారా డీలర్లు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం పీడీఎఫ్ కమీషన్ చెల్లింపులు నిలిపివేయడం, నాన్ పీడీఎఫ్ ఆదాయం లేకపోవడంతో ఏపీలో 29 వేల మంది రేషన్ డీలర్లు రోడ్డున పడ్డారు. త్వరలో వీరు కోర్టును ఆశ్రయించడంతోపాటు, ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు సిద్దం అవుతున్నారు.
పెరిగిపోతున్న అక్రమాలు..
రేషన్ డీలర్ల నాన్ పీడీఎఫ్ ఆదాయానికి గండి పడటంతో వారు అక్రమాలకు దిగుతున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాల వద్ద వేలు ముద్రలు తీసుకుని బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.10 ఇస్తున్నారు. పలు జిల్లాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మరలా కిలో రూ.14 చొప్పున అమ్ముకుంటూ ఆదాయం పొందుతున్నారు. వీరికి ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారు కూడా సహకారం అందించడం, వచ్చిన ఆదాయం ఇద్దరూ పంచుకుంటూ కొత్త దందాకు తెరలేపారు. ఇంటింటికి రేషన్ సరఫరా చేయాల్సిన వాహనాలు నాలుగు వీధులకు ఒక కూడలిలో అందరినీ రోడ్డుపై అడ్డుగా నిలిపి సరఫరా చేయడంపై కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రతి వీధిలో వాహనం తిరగాలని, వాహనాలను పర్యవేక్షించేందుకు 12,000 వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఏది ఏమైనా ఏపీలో రేషన్ పంపిణీ గందరగోళంగా మారిందని చెప్పవచ్చు.
Must Read ;- ఇంటింటికీ రేషన్.. అభాసుపాలు..!