ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏపీలో ఉద్యోగులకు, మాజీ ఉద్యోగులకు వేతనాలు, ఫించన్లు నేటికీ అందలేదు. ఫిబ్రవరి 12 వ తేదీ వచ్చినా కనీసం ఫించన్లు కూడా జమ కాలేదు. దీంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఏపీ ప్రభుత్వం గత నెల చివరి వారంలో రూ.2800 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో ఈ నెల వేతనాలు, ఫించన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీ ప్రభుత్వం వద్ద కనీసం రూ.2000 కోట్లు కూడా లేకపోవడంతో ఫించన్లు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఫించన్లు, వేతనాలు చెల్లించేందుకు మరలా ఏపీ ప్రభుత్వం అప్పుల వేట ప్రారంభించింది.
అప్పుల వేట..
ఏపీలో జీతాలు ఇస్తే, సంక్షేమ పథకాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. సంక్షేమ పథకాలకు ప్రభుత్వ ఆదాయం మళ్లిస్తే, ఇక జీతాలు, ఫించన్లకు కూడా అప్పుల వేట కొనసాగించాల్సి వస్తోంది. గత నెలలో అమ్మఒడికి రూ.6000 కోట్ల అప్పు తీసుకురావడంతో ఈ నెలలో అప్పులు కూడా అంత సులువుగా పుట్టేలా కనిపించడం లేదు. నాబార్డు ఏపీ ప్రభుత్వానికి రూ.400 కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ మొత్తం కూడా వేతనాలు, ఫించన్లు చెల్లించేందుకు సరిపోయేలా లేవు. దీంతో మరోసారి ఓడీకి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రతి నెలా ఓడీకి వెళ్లాల్సి రావడంతో ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో లక్షా 30 వేల కోట్ల రుణాలు చేయడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ఏపీ ప్రభుత్వం తీరు మార్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
Must Read ;- జీతాలివ్వండి.. రోడ్డెక్కిన ఉద్యోగులు..
ఆదాయం పెంచే మార్గాలను వెతకండి..
అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఆదాయం పెంచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఏపీలో ఎప్పుడో వేసిన రోడ్లకు మరమ్మతులు నిర్వహించి టోల్ గేట్లు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వ్యతిరేకత వస్తుందని ప్రస్తుతానికి వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు ముగియగానే జనంపై టోల్ బాధుడుకు రంగం సిద్దం చేస్తున్నారు. గనుల ఆదాయం కూడా 40 శాతం పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీంతోపాటు ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల తరవాత పన్నుల వడ్డింపు కూడా తప్పేలా లేదు. ఈ నెలలో రైతుభరోసా పథకానికి మరో రూ.4500 కోట్లు అవసరం ఉంది. ఈ మొత్తానికి కూడా రుణాల వేట ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సహకారం లేకపోవడంతో పన్నులు పిండేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.
రేషన్ డోర్ డెలివరీ ఖర్చులు మాకు సంబంధం లేదు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామని, దీనికి ఏటా అయ్యే వ్యయం రూ.1200 కోట్లు కేంద్ర భరించాలని వైసీపీ ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కోరారు. అయితే రేషన్ డోర్ డెలివరీకి అయ్యే వ్యయం కేంద్రం భరించదని ఆమె తేల్చి చెప్పడంతో వారంతా వెనుదిరిగినట్టు తెలుస్తోంది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన అన్ని నిధులను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా పదిరోజుల పాటు ఢిల్లీలో ఉండి పలువురు మంత్రులను కలిసేందుకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ మరోసారి ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రుణాలను ఉపయోగించుకుంది. ఇక తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల ద్వారా కొత్తగా రుణాలు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఇప్పటికే పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.25 వేల కోట్లు రుణాలు తీసుకువచ్చారు. ఇక ఆ సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం లేదు. అందుకే కొత్తగా ఇసుక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఆ కార్పొరేషన్లో వేసి దాని ద్వారా రూ.12000 కోట్ల రుణం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎంత వరకు వారి ప్రయత్నాలు సఫలం అవుతాయో వేచి చూడాల్సిందే.
Also Read ;- అప్పులే ఆసరా, వడ్డీలు కట్టాలన్నా అప్పులే దిక్కు!