కొన్ని దశాబ్దాలుగా రెడ్డి కులానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చింది. అత్యధిక పర్యాయాలు పీసీసీ, ముఖ్యమంత్రి పోస్టుల్ని ఆ కులానికే కట్టబెట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఈ నిర్ణయాలతో కాంగ్రెస్ పెద్దగా లాభపడిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక.. తాము తిరుగులేని శక్తిగా అవతరిస్తామని కలలు కన్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో పునరాలోచనల్లో భాగంగా రెడ్డి వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలు నడుస్తున్నాయి.
ఆఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తిరిగి నియమితులు కాగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చలనం ప్రారంభమయ్యింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఇటీవలే నియమించారు. దీంతో ఆ రాష్ట్ర పీసీసీ కార్యవర్గాన్ని కదిలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉందంటున్నారు. ఆయన స్దానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులస్థులకు ఇప్పటి వరకూ చాల అవకాశాలు కల్పించారని, పీసీసీలో కీలక పదవులతో పాటు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవులు కూడా వారికే కట్టబెట్టారని ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకులు కీనుక వహిస్తున్నారు.
దీంతో పాటు పార్టీని ఇరుకున పెట్టిన గులాంనబి ఆజాద్ వర్గానికి చెందిన వారిగా భావిస్తున్న నాయకులకు చెక్ పెట్టే దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క కార్యనిర్వాహకఅధ్యక్షుడిగా ఉన్నారు. సోనియా గాంధీ నాయకత్వానికి తెలంగాణలో మొట్టమొదట సంఘీభావం పలికిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్కే. పార్టీ సంక్షోభ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకూడుకు కళ్లేం వేయాలంటే బడుగు, బలహీన వర్గాల నుంచి మద్దతు సంపాదించాలని, ఇందుకోసం ఆ వర్గానికి చెందిన వారికే పీసీసీ అధ్యక్ష పదవితో పాటు కీలక పదవులు కూడా కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి జరిగే తెలంగాణ పీసీసీ ప్రక్షాళనలో సోనియా మార్క్ తప్పనిసరిగా కనబడుతుందని, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ఉప్పు.. నిప్పుగా ఉండే వెలమ, రెడ్డి సామాజిక వర్గాలలో వెలమలు టీఆర్ ఎస్ వైపే ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం అంతా పదవులతో పని లేకుండా తమ ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నది అధిష్టానం ఆలోచనగా చెబతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఎస్ పీసీసీలో రెడ్ల హవా తగ్గే అవకాశాలున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది.











