భాషకూ భావానికీ ఉన్న అనుబంధమే వేరు. అలా బాలుకు కూడా అక్షరానుబంధం ఉంది.. అది ఈనాడుతోనూ, దాని అధినేతతోనూ పెనవేసుకుపోయింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు దూరదృష్టి ఎక్కువ. ఆయన తెలుగులో శాటిలైట్ ఛానెల్ ఈటీవీని 1995 ఆగస్టు 27 నుంచి ప్రారంభించారు. ఈటీవీని ప్రారంభించిన తొలిరోజుల్లోనే బాలు మీదకు ఆయన దృష్టిపోయింది. బాలుతో మనం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవచ్చు అని ఆలోచించారు. ‘ఈనాడు’ సైన్యం కూడా దాని మీద దృష్టి పెట్టి కసరత్తులు చేసింది. అసలు బాలుతో ప్రోగ్రామ్ చేయించాలన్న ఆలోచనే గొప్ప విషయం.
1996 జనవరి 12 నుంచి ఈటీవీలో ‘పాడుతా తీయగా’ ప్రసారాలు మొదలయ్యాయి. ఈ ప్రోగ్రామ్ ఎంతో జనాదరణ పొందింది. మొత్తం 1100 ఎపిసోడ్స్ గా దీన్ని రూపొందించారు. దశాబ్దాల పాటు ఇది కొనసాగింది. దీనికి సూత్రధారి రామోజీ అయితే పాత్రధారి బాలు. తెలుగులో ప్రతిభా వంతులైన గాయకులను వెలికితీయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. అలా వెలుగులోకి వచ్చిన గాయకులు ఎందరో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులుగా ఎదిగారు. అప్పట్నుంచి రామోజీరావుకు బాలూతో అనుబంధం బాగా పెరిగిపోయింది.
అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!
అనంతరకాలంతో అది ఆత్మీయస్నేహబంధంగా పెనవేసుకుపోయింది. బాలు చెన్నైలో ఉన్నా ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు మరణవార్త తెలిసిన వెంటనే ఇది మాటలకందని మహావిషాదంగా రామోజీరావు అభివర్ణించారు.సంగీతానికి బాలు స్వరం ఓ వరం అని కొనియాడారు. బాలు తనకు ఎంతో ఆత్మీయుడని, గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడిని కోల్పోయానని బాలుకు నివాళులర్పించారు రామోజీరావు.










