TPCC Chief Revanth Reddy Meets Ramoji Rao :
టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆయన ఈనాడు గ్రూపుల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందే రాష్ట్రంలోని ప్రముఖ మీడియా సంస్థల అధిపతులను కలిసి వారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ, టీవీ5 అధిపతి బీఆర్ నాయుడులను కలిసిన రేవంత్ ఈరోజు ఈనాడు- ఈటీవీ ఛైర్మన్ రామోజీరావును కలిశారు. పదవి ఖరారయిన అర్వాత పార్టీలోని అందరిని కలుపుకుని వెళతానన్న రేవంత్ తొలుత అసంతృఫ్తులను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. నిన్న బెంగుళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచిన డీకే శివకుమార్‌తో పాటు పలువురు నేతలను కలిసి వారి ఆశీస్సులు, సలహాలు పొందారు.
అందరితో చర్చించి భవిష్యత్ ప్రణాళిక
ఈ రోజు బెంగుళూరు నుంచి శంషాబాద్ చేరుకున్న రేవంత్‌రెడ్డి అటు నుంచే నేరుగా రామోజీ పిలింసిటీకి వెళ్ళి రామోజీరావును కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రణాళికలో భాగంగా మీడియా అధిపతుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడతాయన్న ఆలోచనతోనే రేవంత్ వారిని కలుస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌తో పాటు రేపు కొత్త టీపీసీసీ కార్యవర్గమంతా పదవీ భాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అందరితోను చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నట్లు రేవంత్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొత్తానికి త్వరలోనే పార్టీలోని అందరితోను చర్చించి, అందరిని కలుపుకుని రేవంత్ యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.
భారీ బైక్ ర్యాలీ
రేవంత్‌రెడ్డి పదవీ స్వీకారం సందర్భంగా రేపు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రణాళిక రూపొందించాయి. ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 బైకులతో మొత్తంగా దాదాపు 5 వేల బైకులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా యువత ప్రముఖంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు.
ఈ రోజు సాయంత్రం రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలను కలవనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ను కలవడానికి వీరిద్దరూ సుముఖత వ్యక్తం చేయలేదని, అయితే మల్లు రవి వీరితో చర్చలు జరిపి ఒప్పించినట్టు సమాచారం. మల్లు రవి మంత్రాంగంతో వారు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అందరి ఆశీస్సులతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఫూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- కేసీఆర్‌పై రేవంత్ సరికొత్త అస్త్రం రెడీ