టీ కాంగ్రెస్ లో ఇప్పుడు మాటల మంటలు రేగుతున్నాయి. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక పార్టీలో మెజారిటీ మంది నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని సదరు నేలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా బయటపెడుతున్నారు. అయితే అందరిలోకీ కాస్తంత భిన్నంగా కనిపించే మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి… తనకు పదవి దక్కలేదన్న బాధలో కాస్తంత సీరియస్ వ్యాఖ్యలే చేశారు. తన నోట నుంచి వచ్చే వ్యాఖ్యల పర్యవసానం ఏమిటన్న విషయం ఆయనకు తెలియదనడానికి కూడా లేదు. ఎందుకంటే… పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటుగా మంత్రిగా పనిచేయడం, ఇప్పుడు ఏకంగా ఎంపీగా కొనసాగుతుండటం, ఆది నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో తన వ్యాఖ్యల పర్యవసానం తనకు తెలయదనుకోవడానికి లేదు మరి ఆ పరిణామాలకు సిద్ధపడే వెంకటరెడ్డి ఏకంగా అధిష్ఠానాన్నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారా? వేటు వేయించుకోవడానికి సిద్ధపడ్డారా? అన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
పదవి కోసం ముమ్మర యత్నం
టీ పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి ఏ ఒక్కరూ చేయనంత భారీ యత్నాలు చేశారు. రేవంత్ రెడ్డి ఎలాగూ కొత్త నేత కాబట్టి… పదవి తప్పనిసరిగా తనకే దక్కుతుందన్నది ఆయన భావన. అంతేకాకుండా ఆది నుంచి తనలా పార్టీనే నమ్ముకుని… వైరివర్గాలతో పోటీ పడగలిగే సత్తా కలిగిన తనలాంటి నేతలకు కాకుండా ఇంకెవరికి పదవి దక్కుతుందన్నది కోటమిరెడ్డి భావన. ఈ భావనతోనే ఆయన పీసీసీ పదవి కోసం ఓ రేంజిలో యత్నించారు. ఆ మేరకు పార్టీ హైకమాండ్ కూడా ఆయన అభ్యర్థిత్వం పట్ల భారీ కసరత్తే చేసింది. అయితే రేవంత్ తో పోల్చి చూశాక… ఎందుకనో గానీ అధిష్ఠానానికి కోమటిరెడ్డి ఎంపిక అంతగా సరి కాదనే అనిపించింది. వెరసి కోమటిరెడ్డికి బదులుగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం ఛాయిస్ గా నిలిచింది.
పీసీసీ చీఫ్ పదవినే అమ్ముకుందా?
ఈ ఒక్క నిర్ణయం కోమటిరెడ్డిలో తీవ్ర అసహనానికి గురి చేసింది. పదవి కోసం రోజుల తరబడి ఢిల్లీలో మకాం పెట్టిన కోమటిరిరెడ్డి.. రేవంత్ కు పదవి ప్రకటించిన మరునాడు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగంగానే… మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి…. అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు మాదిరే రేవంత్ ఎంపిక జరిగిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే… రేవంత్ దగ్గర డబ్బు మూటలు అందుకుని అధిష్ఠానం పదవిని ఆయనకు కట్టబెట్టిందని కోమటిరెడ్డి పరోక్షంగా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదని కూడా ఆరోపించారు. మొత్తంగా తనలోని ఆవేదనను వెళ్లగక్కే క్రమంలో పీసీసీ చీఫ్ పదవినే అధిష్ఠానం అమ్ముకొందన్న కోణంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్య పెను కలకలమే రేపుతోంది.
తెలిసే ఈ వ్యాఖ్య చేశారా?
ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న వెంటనే…. అధిష్ఠానం చాలా సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. అసలు కోమటిరెడ్డి ఏం మాట్లాడారు అన్న దానిని తెలిపేందుకు సదరు వ్యాఖ్యల వీడియోను పంపాలని కూడా రాష్ట్ర పార్టీ నేతలను ఆదేశించిందట. ఈ క్రమంలో ఆ వీడియో కూడా అధిష్ఠానానికి ఆదివారమే చేరిపోయిందని సమాచారం. ఈ వ్యాఖ్యల పర్యవనసానం ఏమిటో తెలిసే కోమటిరెడ్డి మాట్లాడారని, పార్టీ నుంచి బహిష్కరణ వేటును కావాలనే ఆయన కోరుకుంటున్నారా? అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- నలుదిక్కులా నిరసనలే!.. రేవంత్ నెట్టుకొచ్చేదెలా?