రేపు టీజర్ విడుదల కాబోతున్న తరుణంలో సలార్ స్టోరీ లీకులు కూడా ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 28న సలార్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రూ. 500 కోట్ల వ్యయంతో రూపొందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ప్రభాస్ హీరో కావడం, మరో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ కావడం, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం, కేజీఎఫ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడం లాంటి అంశాలెన్నో ఈ సినిమాకు భారీ హైప్ ను తెచ్చిపెట్టాయి.
అమ్మ సెంటిమెంట్ తో కేజీఎఫ్ రూపొందితే ఈ సినిమా ఫ్రెండ్ షిప్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిందన్నది సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఐఎండీబీ ప్రకటించింది ఫ్రెండ్ షిప్ అనే అంశం ఉంది కాబట్టి మరి ప్రభాస్ ఫ్రెండ్ ఎవరు అన్న క్యూరియాసిటీ కూడా నెలకొంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి కావచ్చన్న ఊహాగానాలు ఏర్పడ్డాయి. రిషబ్ శెట్టి ఫ్రెండ్ అయిన రక్షిత్ శెట్టి చార్లీ 777 సినిమా హిట్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక లీకైన కథ విషయానికి వస్తే స్నేహం కోసం ప్రాణాలు తీసే పాత్ర ప్రభాస్ ది.
ఓ సాధారణ మెకానిక్ గా జీవితాన్ని గడిపే యువకుడు ప్రపంచం లోనే మోస్ట్ వయోలెంట్ మ్యాన్ గా ఎలా మారాడన్నదే ఈ సినిమా లైన్.తన స్నేహితుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి క్రిమినల్ ముఠాలను అతను మట్టుబెడతాడు. అందుకే ఈ సినిమాకి ఎక్కువ మంది విలన్ల అవసరం కూడా ఏర్పడింది. వరదరాజ మన్నార్ అనే పాత్రను మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారు. మెయిన్ విలన్ అతనేన్న మాట వినిపిస్తోంది.ఇక జగపతిబాబు, దేవరాజ్, మలయాళ నటుడు గురుస్వామి, శ్రియారెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. శృతిహాసన్, అపర్ణాబాలమురళి లాంటి గ్లామర్ కూడా ఈ కథకు తోడైంది.
మరో వైపు కేజీఎఫ్ 2తో కూడా ఈ సినిమా కథకు కనెక్షన్ ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అలా చూస్తే మార్వెల్ తరహా ప్రయోగానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరతీసినట్టే. తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తున్నాడు. బొగ్గు గనులకూ ఈ కథకూ ఎలాంటి సంబంధాన్ని ముడిపెట్టారో చూడాలి. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందన్న మాట వినిపిస్తోంది. భవిష్యత్తులో రాఖీభాయ్ నీ సలార్ భాయ్ నీ కలిపే ప్రయత్నం చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.