తెలుగుజాతి యావత్తూ ‘అన్న’గా పిలుచుకునే.. నందమూరి తారక రామారావు మరణానికి పరోక్షంగా అయినా.. సీనియర్ తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు కారణం అవుతారా? సీనియర్ జర్నలిస్టు, సమాచార హక్కు మాజీ కమిషనర్, సాక్షి దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీరామారావు హయాంలో స్పీకరుగా పనిచేసిన యనమల రామకృష్ణుడు.. ఎన్టీరామారావు చేసిన విజ్ఞప్తిని రాసిన లేఖను పట్టించుకోకుండా.. యనమల రామకృష్ణుడు వ్యవహరించారని దిలీప్ రెడ్డి పేర్కొంటున్నారు. ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. తన వాదనకు మద్దతుగా.. అప్పట్లో నారాచంద్రబాబునాయుడు తదితరులను సభలో అనర్హులుగా ప్రకటించాల్సిందిగా.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాసిన లేఖ ప్రతిని కూడా ఆయన పోస్ట్ చేశారు.
దిలీప్ రెడ్డి ఫేస్ బుక్ పోస్టు పూర్తి పాఠం ఇలా ఉంది.
నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా యనమల రామకృష్ణుడు కాకుండా కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ వంటి విలువలున్న నాయకుడు ఉండుంటే… పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది! ‘తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, అధికార పార్టీ శాసనసభాపక్ష నేతగా నే చెబుతున్నాను. ఇదుగో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ ఐదుగురు… చంద్రబాబు నాయుడు, అశోక గజపతి రాజు, కొటగిరి విద్యాధరరావు, దేవేందర్ గౌడ్, ఎ.మాదవరెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను. ….అంటే, వారు శాసనసభాపక్షం నుంచి కూడా బహిష్కృతులే… ‘ అని, నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్వయంగా ఈ లేఖ ఇచ్చినా స్పీకర్ లెక్కచేయలేదు. పై పెచ్చు, సభలో, నోరు తెరిచి మాట్లాడేందుకు ఎన్టీయార్ కు అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూనీ చేశారు. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రికి వెన్నుపోటుతో పదవీచ్యుతున్ని చేసి, ప్రజాతీర్పును వంచించారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు “…. చారిత్రక విభాత సంధ్యల…కనిపించని చీకటి కోణాల్లో పడి నలిగిన …” ఈ లేఖ నాటి దౌర్జన్యాలకు ఓ సజీవ సాక్ష్యం.
(నేడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి సంస్మరణ)
==
స్పీకరుకు ఎన్‌టి రామారావు రాసిన లేఖ ప్రతి
==
అప్పట్లో ఎన్టీ రామారావు ను పదవీచ్యుతుడు కావడం వెనుక.. చంద్రబాబునాయుడుకు స్పీకరు హోదాలో యనమల రామకృష్ణుడు సహకరించారనే ఆరోపణలు గతంలోనుండి కూడా వివిధ సందర్భాల్లో వినవస్తూ ఉంటాయి.
‘‘చారిత్రక విభాత సంధ్యల – కనిపించని చీకటికోణాల్లో పడి నలిగిన..’’ అంటూ సాగే మహాకవి శ్రీశ్రీ కవితను కూడా ఆయన ఇందులో ఉదాహరించారు. అప్పటి దౌర్జన్యాలకు ఇది ఉదాహరణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడు దిలీప్ రెడ్డి పోస్టు చేసిన ఈ లేఖ, ఫేస్ బుక్ లో ప్రభుత్వ అనుకూలురకు ఉత్సాహాన్నిస్తోంది.
Must Read ;- ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి