వీరాభిమానం ఉండటం తప్పేమీ కాదు.. కానీ దాన్ని వ్యక్తం చేసే తీరులోనే విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోహీరోయిన్లకు అభిమానులు ఎక్కువ. అది ఎక్కడి దాకా వెళుతుందీ అంటే గుడులు కట్టడం, కటౌట్లకు పాలాభిషేకం చేయడం వరకూ వెళుతుంది. ఆ అభిమానాన్ని మరో మనిషికి అన్నం పెట్టే పనికి వినియోగిస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. అలాంటి పనిని ఓ అభిమాని చేశాడు.. అతను హీరో అభిమాని కాదండోయ్ హీరోయిన్ అభిమాని. ఆమె మరెవరో కాదు అక్కినేని సమంత.
కటౌట్లు పెట్టే సంప్రదాయం కన్నా ఇలాంటి అన్నదానం, రక్తదానం ఎంతో మేలు కదా. ఆ అభిమాని పేరు చరణ్ తేజ. ఓ టీవీ ఛానెల్ లో కెమెరామన్ గా పనిచేస్తుంటాడు. సమంత సినిమా విడుదలైతే అతనికి పండగేనట. నిన్న ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా చరణ్ చేసిన పనికి ఎందరో అభినందిస్తున్నారు. దాదాపు 100 మంది నిరుపేదలకు తన సొంత ఖర్చుతో అతను భోజనం పెట్టి సమంతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈసారి సమంత పుట్టిన రోజును సరికొత్తగా జరుపుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను చెబుతున్నాడు. కరోనా సమయంలో చాలామంది భోజనం కూడా దొరక్క అల్లాడుతున్నారని తెలుసుకున్నాడు. బసవతారకం ఆస్పత్రి వద్ద ఫుట్ పాత్ పై ఆకలితో అలమటిస్తున్న దాదాపు 100 మందికి భోజనం అందించే ఏర్పాటుచేశాడు. అతను చేసిన ఈ పనికి సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంతే కాదు సమంతకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అతనికి ఎంతో సంతోషం కలుగుతుందట.
Must Read ;- మహిళా ఆటో డ్రైవర్ కు సమంత గిఫ్ట్











