(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయనగరం ఎమ్మార్ కాలేజీ వేదికగా పూసపాటి రాజవంశీయుల వారసులైన సొంత అక్కచెళ్లెళ్లు ఢీ కొడుతున్నారు. వాళ్ల బాబాయ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తగిలించి తమాషా చూస్తున్నారు.
ఎమ్మార్ ప్రైవేటీకరణకు సంచైత సిఫార్సు
విజయనగరం మాన్సాస్ పరిధిలోని పురాతన, ప్రతిష్టాత్మక, చారిత్రj ప్రసిద్ధి కలిగిన విజయనగరం మహారాజ (అటానమస్) డిగ్రీకాలేజీని ప్రస్తుత ఛైర్‌పర్సన్ సంచైత గజపతిరాజు ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదే తరుణంలో ఆమె చెల్లెలు, మాన్సాస్ డైరెక్టర్ ఊర్మిళ గజపతిరాజు ససేమిరా అంటున్నారు.
చారిత్రక కళాశాల ప్రైవేటీకరణ! : మాన్సాస్‌లో మరో అలజడి
వంశచరిత్రను మంటగలిపితే సహించేదిలేదు : ఊర్మిళ
‘ఎమ్మార్ డిగ్రీ కాలేజ్ 1879 లో నా పూర్వీకులైన మహారాజ విజయరామ గజపతి రాజు గారిచే విజయనగరంలో స్థాపించబడిన మొదటి కాలేజ్. ఈ కాలేజ్ చరిత్ర విజయనగరం చరిత్ర ఒకదానికొకటి ఎంతగానో అల్లుకుపోయాయి. అతి తక్కువ ఫీజుతో లేదా అస్సలు ఫీజు లేకుండా విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం కల్పించింది ఈ కాలేజ్. అంతేకాక అందులో పనిచేసే వారికీ ఉద్యోగ భద్రత కల్పించడం అనేది మాన్సాస్ ట్రస్ట్ యొక్క ముఖ్యఉద్దేశం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయతలపెట్టారు
మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్ పర్సన్. ఆ చర్య ద్వారా మా తాతగారైన పీవీజీ రాజుగారు మా తండ్రిగారైన ఆనంద గజపతి రాజుగారి వారసత్వాన్నీ వంశ చరిత్రనీ మంటగలిపే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. మా వంశ చరిత్రనీ గౌరవాన్నీ వారసత్వాన్నీ పరిరక్షించడానికి అంటూనే, ఆ చరిత్రని పాడుచేసే ఎన్నో చర్యలను ఆమె తలపెట్టడం ఎంతో బాధాకరం. నా తండ్రిగారు ఏ ఆశయం కోసం నిలబడ్డారో వాటికి ఈమె చర్యలు విరుద్ధంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎమ్మార్ కాలేజీలో చదివిన ఎంతో మంది మంచి పదవుల్లో ఉండి దేశానికీ పేరు తెచ్చారు. తెస్తున్నారు. వారిలో రాజకీయవేత్తలు, హైకోర్టు జడ్జిలు అధికారులు, కవులుగా పేరుతెచ్చుకున్నారు. గాంధీజీ నెహ్రూజీ సర్వేపల్లి రాధాకృష్ణన్ సరోజినీ నాయుడు వంటి ఎందరో గొప్పవారు ఈ కాలేజీని సందర్శించారు. విద్యపై అందరికీ సమాన హక్కువుంటుంది. ఆ హక్కుని కాలరాచి పేదవారికి చదువునిదూరం చేసే వీరి ఆలోచనని నేనూ, నా తల్లిగారు ఖండిస్తున్నాము. మాన్సాస్ ట్రస్ట్ ఆశయాన్ని కాపాడతామని విజయనగర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము.
ఊర్మిళ గజపతిరాజు
… అంటూ ఆమె లేఖ విడుదల చేశారు.
ఎవరీ ఊర్మిళ
విజయనగరానికి చెందిన పూసపాటి వంశీయుడైన ఆనందగజపతిరాజు (అశోక్ గజపతి అన్నయ్య) రెండవ భార్య కుమార్తె ఊర్మిళ గజపతిరాజు. మొదటిభార్య కుమార్తె సంచైత గజపతిరాజు. వీరిద్దరూ స్వయాన అక్కచెళ్లెళ్లు. రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ఛైర్పర్షన్ గా సంచైతను నియమించడంతో పాటు ఊర్మిళను కూడా డైరెక్టర్ గా నియమించింది. కాలేజీ వేదికగా వీరిద్దరూ ఇప్పుడు ఢీ కొనేందుకు సిద్ధ పడుతున్నారు.
ఎమ్మార్ ప్రైవేటీకరణ: బాబాయ్ బీజం … అమ్మాయి ఆజ్యం
ఉధృతమవుతున్న ఉద్యమం
ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణను ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని స్థానిక విపక్ష రాజకీయ పార్టీలు, పౌరహక్కుల, విద్యార్థి సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి స్థానికంగా ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.