విక్కీ కౌశల్.. నిన్నటి దాకా ఇతని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నేడు అతను ఓ ట్రెండింగ్ హీరో. దానికి కారణం ‘సర్దార్ ఉదమ్’ చిత్రం. అమెజాన్ ప్రైమ్ లో ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు కొత్త రికార్డులు ఈ సినిమా సొంతమవుతున్నాయి. ఐఎండీబీ టాప్ 250 సినిమాల జాబితాలో అత్యున్నత స్థానాన్ని దక్కించుకోవడం ఓ సినిమాకి సంబంధించిన ఓ విశేషం. ఐఎండీబీ రేటింగులో 10కి 9.2 రేటింగ్ దీనికి దక్కింది. షూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదలైంది.
ఇంతకుముందు షేర్షా, సర్పట్టా పరంపర, దృశ్యం 2 చిత్రాలను కూడా ఇది అధిగమించింది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ ఉన్న చిత్రాలు చాలా అరుదు. వాటిలో నాయకన్, త్రీ ఇడియట్స్, గైడ్, సత్య, షోలే, లగాన్, చక్ దే ఇండియా లాంటి అత్యుత్తమ చిత్రాలు ఉన్నాయి. వీటిని దాటుకుని సర్దార్ ఉదమ్ ముందుకు దూసుకొచ్చింది. బాహుబలి 2, కేజీఎఫ్ లాంటి కొన్ని చిత్రాల సరసన నిలిచింది.
14000 కన్నా ఎక్కువ ఓట్లు వస్తేనే 9.2 రేటింగ్ దక్కుతుంది. ఇంతకీ ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పుల ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ డయ్యర్ ను హత్య చేసిన భారతీయ విప్లవకారుడు ఉదమ్ సింగ్ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ పాత్రను విక్కీ కౌశల్ పోషించారు. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ మారణకాండలో అనేకమంది భారతీయులు మృత్యువాత పడ్డారు. దానికి ప్రతీకారం తీర్చుకోడానికి ఉదమ్ సింగ్ ఏం చేశాడన్నది ఈ సినిమాలో చూడవచ్చు.
విక్కీ కౌశల్ నటన, షూజిత్ సర్కార్ దర్శకత్వ ప్రతిభ, కెమెరా పనితనం, కథన విధానం.. లాంటి అంశాలన్నీ ఈ సినిమాని ఆణిముత్యంగా మలిచాయి. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ సినిమా అందుకుంటోంది. మరో విశేషమేమిటంటే అత్యుత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 2022 ఆస్కార్ అవార్డు కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం షార్ట్ లిస్టు సినిమాల జాబితాకు కూడా ఇది ఎంపికైంది. ‘సర్దార్ ఉదమ్’ సినిమాపై ఆస్కార్ ఆశలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా దెబ్బతో విక్కీ కౌశల్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.











