ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు.. ఆయా కేసుల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పలు కీలక తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికార పార్టీగా వైసీపీ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నిబంధనలకు అనుకూలంగానే ఉండాల్సిన అవసరం ఉంది కదా. అయితే అందుకు విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కారు తీసుకున్న ఆయా నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది. ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురు వ్యక్తులు.. హైకోర్టును, తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా పలు సంచలన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఐడీని ఆదేశించింది. అయితే సీఐడీ అధికారుల నాన్చుడు ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. కేసును నేరుగా సీబీఐకి అప్పగించింది.
మరో ఆరుగురు అరెస్ట్
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నారు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను గుర్తించారు. అంతేకాకుండా ఆయా పోస్టులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆపై వాటిని తొలగించిన వారిని కూడా గుర్తించారు. నిందితులను గుర్తించిన వెంటనే వారి కోసం వేట ప్రారంభించిన సీబీఐ అధికారులు.. గత జూలై, ఆగస్ట్ నెలల్లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా చాలా మందిని విచారించిన సీబీఐ.. కీలక వ్యక్తులుగా భావిస్తున్న వారినే అరెస్ట్ చేసింది. తాజాగా శుక్రవారం నాడు మరో ఆరుగురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా అరెస్టైన వారిలో జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్ తదితరులున్నారు. తాజా అరెస్ట్‌లతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య మొత్తం 10కి చేరింది. తాజాగా అరెస్టైన వారిపైనా చార్జిషీట్లను దాఖలు చేసేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది.
సీబీఐ దూకుడుతో వైసీపీ బెంబేలు
న్యాయమూర్తులపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసుల నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినంతనే వైసీపీలో అలజడి మొదలైంది. కేసును సీఐడీ నుంచి సీబీఐకి తరలిస్తూ హైకోర్టు తీర్మానించడంతో వైసీపీ మరింతగా జడిసిసోయింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారితో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించింది. అంతేకాకుండా అదే మాటను పార్టీకి చెందిన కీలక నేతలతో కూడా చెప్పించింది. ఇప్పటికే ఓ నలుగురు నిందితులు అరెస్ట్ కాగా.. వారెక్కడ పార్టీ పేరు చెబుతారోనన్న భయాందోళనకు గురైన వైసీపీ.. తాజాగా మరో ఆరుగురు కూడా అరెస్ట్ కావడంతో మరింత ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి ఈ నెల 6న స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించిన సీబీఐ.. తాజాగా అరెస్ట్ చేసిన నిందితులకు సంబంధించిన చార్జిషీట్లను కూడా కోర్టుకు సమర్పించనుంది.