జగన్‌తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని, పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది. సెకీ – సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, అధికారులు ఎవరూ అతీతం కాదు. తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMD రామేశ్వర్ ప్రసాద్ గుప్తా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. మరో నెలలో ఆయన పదవీ కాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని సమాచారం.
వైసీపీ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూపు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు 2024 నవంబరులో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగపత్రంలో సెకీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం ముట్టజెప్పినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర డిస్కంలతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి.
‘సెకీ’తో 7 వేల మెగావాట్ల PSA మొదటి నుంచి వివాదాస్పదమే. ఈ ఒప్పందానికి సంబంధించి 2021 సెప్టెంబరు 15న సెకీ లేఖ రాయగా.. ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. 2021 డిసెంబరు 1న సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత (2024 నవంబరు) అమెరికా దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఒప్పందం వెనుక అదానీ సంస్థ..అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించడం సంచలనమైంది. ఆరోపణలన్నీ జగన్‌వైపే వేలెత్తి చూపిస్తుంటే..ఆయన మాత్రం బుకాయించే ప్రయత్నమే చేశారు. ఆయన చెప్పిందే వాస్తవమైతే సెకీ సీఎండీపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకున్నట్లు? దీనిపై మరోసారి విలేకరుల సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేసి వివరిస్తారా అన్న మాట వినిపిస్తోంది.
గతంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జగన్ సెకీతో మేం కుదుర్చుకున్న ఒప్పందం చరిత్రాత్మకమంటూ గొప్పలు చెప్పుకున్నారు. అంతే కాదు తనకు శాలువా కప్పి, గొప్పగా పొగడాల్సింది పోయి ఆరోపణలు ఏంటి అంటూ కామెంట్స్ చేశారు. అవార్డు, రివార్డు ఉంటే తనకు ఇవ్వాల్సిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.











