Senior Publicity Designer Eswar Passed Away :
రోడ్డు మీద గోడలకు అతికించి ఉండే పోస్టర్లే కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ పోస్టర్ స్వరూపస్వభావాల్లో ఎంతో మార్పు వచ్చినా సినిమాని జనంలోకి తీసుకెళ్లడంలో ఈ పోస్టర్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. అందుకే ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ‘సినిమా పోస్టర్’ పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకానికి 2011లో నంది అవార్డు కూడా లభించింది. ఈరోజు ఆయన చెన్నైలో కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆయన స్వగ్రామం. ఆయన వయసు 85 సంవత్సరాలు.
వ్యక్తిగా ఆయన జీవితంలో ఎన్ని ఒడుదొడుకులను ఎదుర్కొన్నారో, సినిమా రంగంలో పబ్లిసిటీ తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఆయన తన పుస్తకంలో రాశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘సాక్షి’ సినిమా ద్వారా 1967లో పబ్లిసిటీ డిజైనర్ గా ఆయన ప్రయాణం ప్రారంభమైంది.దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన ప్రభ వెలిగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 2600 చిత్రాలకు పైగా ఆయన పనిచేశారు. విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు.
పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు చాలా వరకు ఆయన తన తమ్ముడు బ్రహ్మం తో కలసి రూపొందించినవే. ‘దేవుళ్ళు’ ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2015లో ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు సంతాపం ప్రకటించారు.
‘ఈశ్వర్ గారితో మా సంస్థకి విడదీయలేని అనుబంధం ఉంది.ఈశ్వర్ గారు మా సంస్థలో అత్యధిక చిత్రాలకు పనిచేశారు. నాన్న గారికి ఆయన డిజైన్స్ అంటే ఎంతో ఇష్టం. కేవలం పబ్లిసిటీ డిజైనర్‌గానే కాకుండా ఎన్నో సినిమాలకి క్యారెక్టర్ పోస్టర్స్ కూడా డిజైన్ చేశారు. ఈశ్వర్‌గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యలకు మా ప్రగాడ సానూభూతి తెలుపుతున్నాం’ అన్నారు.
పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం
పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా తాను కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలకు ఈశ్వర్ పని చేశారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Must Read ;-, దసరా, దీపావళి బరిలోకి పెద్ద సినిమాలు











