దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ మలయాళంలో దృశ్యం 2 రూపొంది ఓటీటీ విడుదలైంది. ఇదే సినిమా సీక్వెల్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయికానీ చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ హీరోగా రూపొందిన నారప్ప చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుదల చేశారు.
దాంతో సురేష్ ప్రొడక్షన్స్ దృశ్యం 2, రానా హీరోగా నటించిన ‘విరాటపర్వం’ చిత్రాలను కూడా ఓటీటీలో విడుదల చేయాలనుకుందట. ఇప్పుడు సురేష్ బాబు పునరాలోచనలో పడ్డారంటున్నారు. దృశ్యం 2 చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చేతిలో చాలా థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇప్పుడీ థియేటర్లను సురేష్ బాబు తెరిచారు.
ఒరేయ్ బామ్మర్ది, పాగల్ చిత్రాలతో ఈ థియేటర్లు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. టిక్కెట్ల ధరల విషయంలో ఉన్న ప్రతిబంధకాలు కూడా ఈ నెలాఖరులోగా పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల థియేటర్లలోనే దృశ్యం 2 చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది.
దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాని ఓటీటీ ద్వారా నేరుగా విడుదల చేయటానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. మలయళంలో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. 50 రోజుల వ్యవధిలోనే తెలుగు వెర్షన్ షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు.











