బీహార్ ఎన్నికల ఫలితాలు దేశంలోని రాజకీయ పార్టీలకు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత, యువకెరటం తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకుపోయినా చివరకు ఫలితాలు వెలువడే సరికి అధికారానికి పదడుగుల దూరంలో ఆగిపోయారు. ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుందని 90 శాతం సర్వేలు చెప్పాయి. అయితే ఫలితం తారుమారుకావడానికి దారితీసిన పరిస్థితులు విశ్లేషిస్తే మాత్రం అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని, కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ చేసుకున్నారని తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నా, నిజానికి నితీష్ కుమార్ పదిహేను సంవత్సరాల పాలనపట్ల వ్యతిరేక ఓట్లను ఒకటి చేయడంలో తేజస్వి యాదవ్ విఫలం అయ్యారని చెప్పవచ్చు.
కాంగ్రెస్ కు 70 సీట్లు ఇచ్చి తప్పుచేశారా?
బీహార్ లో మహాఘట్ బంధన్ కూటమిలోని కాంగ్రెస్ కు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పెద్ద తప్పే చేశారు. నిజానికి బీహార్ లో కాంగ్రెస్ కు అన్ని సీట్లలో పోటీ చేసే సత్తా లేదు. 70 సీట్లు కేటాయించినా కాంగ్రెస్ అభ్యర్థులు 45 స్థానాల్లోనే గట్టిపోటీ ఇవ్వగలిగారు. కాంగ్రెస్ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే ఎన్డీయే కూటమి అభ్యర్థులు సునాయాసంగా గెలవగలిగారు. బీజేపీకీ బాగా పట్టున్న స్థానాలను కాంగ్రెస్ తీసుకుంది. వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని కాంగ్రెస్ భావించింది, కానీ ప్రస్తుత ఎన్నికల్లో గెలవాలని పోటీ చేసినట్టు లేదనిపించింది. దీంతో ఆర్జేడీ 25 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.
ఆర్జేడీని దెబ్బతీసిన కాంగ్రెస్
ఆర్జేడీ కూడా అంచనా వేసుకున్న స్థానాలకన్నా 15 సీట్లు తక్కువగా గెలవడానికి కాంగ్రెస్ కారణమైంది. 2015లో జనతాదళ్‌తో ఆర్జేడీ జట్టుకట్టినప్పుడు వంద సీట్లకు గాను 80 స్థానాలు కైవశం చేసుకుంది. ఆ సమయంలో జనతాదళ్ 144 సీట్లలో పోటీ చేసి కేవలం 75 స్థానాల్లోనే విజయం సాధించింది.
లోక్ జనశక్తి పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్ల కూడా జేడీయూ కొన్ని స్థానాల్లో ఓటమి పాలైంది. ఎల్జేపీ ఓట్ల చీలిక లేకుంటే జేడీయూకి మరిన్ని స్థానాలు దక్కేవని అంచనా. ఆర్జేడీ గెలిస్తే తేజస్వి యాదవ్ నాయకత్వంలో బీహార్ మరలా ఆటవిక పాలన 2.O వస్తుందని బీజేపీ కూటమి ప్రచారం చేయడం, కుల రాజకీయాలు ఎన్డీయేకు కలసి వచ్చాయి. ఏది ఏమైనా బీహార్ లో తేజస్వి యాదవ్ దే అసలైన గెలుపు అని ఆయన మద్దతు దారులు భావించేస్థాయిలో ఫలితాలు వచ్చాయని మాత్రం ఒప్పుకోవాల్సిందే.











