అధికార వైసీపీలో అసంతృప్తులు కొనసాగుతున్నాయా ? మంత్రివర్గ విస్తరణ తర్వాత సీనియర్ ల ఆందోళన జగన్ కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయా ? నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ నేత నేడు అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటున్నారా ? సైలెన్స్ కాదు నాలో వైలెన్స్ చూపిస్తా అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు ?
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో అధికార వైసీపీలో చెలరేగిన ప్రకంపనలు చల్లారినట్లు కనిపిస్తున్నా లోలోపల ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. పదవులు దక్కని నేతల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు సీఎం జగన్ మూడ్రోజులుగా బుజ్జగింపులు చేపడుతున్నా అవి అనుకూల ఫలితాలను ఇవ్వడం లేనట్లుగానే కనిపిస్తోంది. తాజాగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అంశం సిఎం జగన్ కు తలనొప్పిగా మారిందనే చర్చ వైసీపీ వర్గాల్లో కొనసాగుతోంది.
నిజానికి గొల్ల బాబూరావు మొదటి నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం అయిన వెంటనే జగన్ కోసం బాబూరావు ఉన్న కాంగ్రెసు పార్టీని ,ఎమ్మెల్యే పదవిని వదులుకుని జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. కష్టకాలంలో కూడా జగన్ ను అంటిపెట్టుకున్న తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని గొల్ల బాబూరావులో ఆవేదన చెందుతున్నారట.దీంతో అధిష్టానం పై తిరుగుబాటు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారట.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించి వచ్చిన వారికే మళ్ళీ మంత్రి పదవి ఇవ్వడం పై ఆయన గుర్రుగా ఉన్నారట. జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి బలమైన కాంగ్రెస్ ను ఎదిరించిన తనకు దక్కాల్సిన ఫలితం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇకపై దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారట బాబూరావు.ఉద్యోగం, రాజకీయాల దృష్ట్యా తాను అహింసావాదిగా మారాల్సి వచ్చిందని, తన కార్యకర్తల కోసం హింసావాడిగా మారి తానేంటో జగన్ కి చూపిస్తానని హెచ్చరిస్తున్నారట.
ఇదిలా ఉంటే బాబూరావుకి మంత్రి పదవి ఇవ్వకపోవడం పై ఆయన అనుచరులు మండిపడుతున్నారట. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగన్ వెంట నడిచెందుకు తమ నాయకుడితో పాటు తాము కాంగ్రెస్ కు రాజీనామా చేశాంఅని, అయితే పార్టీ తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారట.నియోజకవర్గంలో జగన్ నియమించిన నలుగురు సమన్వయ కర్తలు ఎన్ని అవమానాలు చేసినా.. కేవలం జగన్ కోసమే తాము తమ నాయకుడు బాబూరావు వెంట నడిచామని, అలాంటి తమకు సముచిత స్థానం కల్పించలేదంటున్నారట. అదేసమయంలో ప్రజలు జగన్ ని చూసి కాదు బాబూరావుని చూసి ఓట్లు వేశారని, జగన్ ఈ విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారట.సామాజిక న్యాయం అంటూ జగన్ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారట.
అదేసమయంలో తమ నాయకుడికి జరిగిన అన్యాయం పై అధిష్టానంతోనే అమీ తుమీ తేల్చుకునేందుకు పెద్దఎత్తున తాడేపల్లి వెళ్ళి సజ్జలను కలిశారట.అయితే సజ్జల సైతం సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం పై బాబూరావు, ఆయన అనుచర గణం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఈ నేపధ్యంలోనే రాబోయే రోజుల్లో జగన్ కు తామేంటో చూపించాలని బాబూరావు నిర్ణయించుకున్నారని ఆయన ఆంతరంగీకులలో జరుగుతున్న చర్చ.
మొత్తం మీద మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో వైసీపీ లో చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలతో రాబోయే రోజుల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయమని, డానికి బాబూరావు ఉదంతమే ఉదాహరణ అని విశ్లేషకులు భావిస్తున్నారట.