ఆమె గుండె గొంతుక రేణుగానం పలుకుతోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా ఆమె అందించే ఈ తరహా గానామృతాన్ని అందరూ ఆస్వాదిస్తుంటారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా జీవితంపై ఓ గ్రాము అనురక్తి ప్రకటించారు. పవన్ కళ్యాణ్ భార్య కాకపోతే రేణు దేశాయ్ ఎవరో ఎవరికీ తెలియదు. చాలామంది హీరోయిన్లను మరచిపోయినట్టుగానే మనమూ మరచిపోయి ఉండే వాళ్లం. పవన్ తో తేడా వచ్చాక ఆమె కొంతకాలం పుణే వెళ్లిపోయారు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో హైదారబాద్ లోనే ఉంటున్నారు.
ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి. మళ్లీ పెళ్లి ఊసులు లేకపోయినా జీవితంలో విరహం, విరక్తి, జీవితంపై అనురక్తి వంటి మాటల్ని ఆమె పోస్టుల్లో చూసుకోవలసి వస్తోంది. ఈరోజు ఆమె ‘సోషల్’ స్పందన ఏమిటో చూద్దాం. ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదట.. నిజమే ఆమె బాగా చెప్పారు. ప్రేమలో విఫలమైతే ఎంత బాధ కలుగుతుందో తనకు బాగా తెలుసట. మనం ఎంతో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేకపోతే.. మనం మోసపోయామని తెలిస్తే ఆ బాధ గుండెల్ని పిండేసినట్టు ఉంటుందట.
జీవితంలో ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదని ఆమె తేల్చేశారు. మన కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహాలు తీసుకుంటూ అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడిపోవచ్చట. ప్రేమకులకు ఈ రేణుగానం ఎంతో ఉపయుక్తంగానే ఉంటుంది. ప్రేమలో మధురిమలు తొలినాళ్లలో ఉన్నట్లుగా జీవితాంతం ఉండవనే సంగతి చాలా మందికి తెలిసినా తెలియనట్టే ఉంటారు. ఆమె ఆవేదన, ఆలోచన అంతా ఇన్ స్టా గ్రామ్ లో లైవ్ చిట్ ఛాట్ తో సాగిపోయింది. ప్రస్తుతం ఆమె ఆద్య పేరుతో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సినిమాల్లో రీఎంట్రీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Must Read ;- ప్రణయామృత గానాలాపన.. ఓ జంట ప్రేమారాధన











