ఇప్పటి వరకు రాజకీయ పార్టీ నేతలు పాదయాత్రలు చేయడం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ఆరేళ్ల బాలుడు న్యాయం కోసం పాదయాత్ర చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ పాదయాత్ర చేపట్టాడు. న్యాయం చేయాలని ప్రధానిని, సీఎంను కోరాడు. నాగప్రణీత్ అనే సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు తన గ్రామం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు తన తాతతో కలిసి మంగళవారం పాదయాత్ర చేపట్టాడు. తమకున్న ఎకరా భూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని ఆరోపించాడు. తమ భూమిని దయచేసి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ తాతయ్యా.. మోదీ తాతయ్యా నాకు న్యాయం చేయండని వేడుకున్నాడు.
తెలిసిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి మమతలకు నాగప్రణీత్(6) అనే కుమారుడు ఉన్నాడు. 2017లో అనారోగ్య సమస్యలతో బాలుడి తల్లిదండ్రులు చనిపోయారు. ఆ నాటినుంచి నాగ ప్రణీత్ తన తాతయ్య వద్ద పెరుగుతున్నాడు. తల్లిదండ్రులు బతికున్న సమయంలో తమకున్న ఒక ఎకరా భూమిని ఓ వ్యక్తికి కౌలుకిచ్చారు. తన తల్లిదండ్రులు ఉన్నంతవరకు కౌలు చెల్లించాడు. కానీ ఎప్పుడైతే వారు చనిపోయారో అప్పటి నుంచి ఎకరా భూమిని చేజిక్కించుకోవాలని ఆ వ్యక్తి ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.
సదరు వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో భూమిని తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో నాగప్రణీత్ తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. తన ఆస్తిని తనకు దక్కేలా చేయాలని ఆ పసివాడు పాదయాత్రను చేపట్టడం అందరినీ కలిచివేసింది. తన తాతతో కలిసి లింగంపల్లి గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టాడు. కేసీఆర్ తాతయ్యా.. మోదీ తాతయ్య నాకు న్యాయం చేయాలని నాగప్రణీత్ కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశాడు.
ఆ బాలుడు చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ స్పందిస్తారో? పీఎం స్పందిస్తారో చూడాలి మరి.