శిల్పా మోహన్ రెడ్డి.. కర్నూలు జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఇంట ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఒకరు నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడు శిల్పా రవికిశోర్ రెడ్డి అయితే, ఇంకొకరు శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి. ఒకే ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటం.. అది కూడా ఒకే జిల్లాలో ఉండటం అరుదే కదా. అలా ఒకే ఇంటిలో ఒకరికి మించి ఎమ్మెల్యేలున్న వారికి పార్టీ అధిష్ఠానం ఓ రేంజిలో ప్రాధాన్యం ఇవ్వడం కద్దే. అయితే ఈ సంప్రదాయం మరే ఇతర పార్టీల్లో అయితే చెల్లుబాటు అవుతుందేమో గానీ.. వైసీపీ మాత్రం కాదని చెప్పాలి. ఎందుకంటే.. ఒకే జిల్లాలో అధికార పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలను కలిగిన శిల్పా ఫ్యామిలీ మాటకు వైసీపీ అధిష్ఠానం అస్సలు విలువ ఇవ్వడం లేదు. దీని వెనుక కారణాలేమిటో తెలియదు గానీ.. ఎమ్మెల్యేలయిన బాబాయి, అబ్బాయిలు మాత్రం అధిష్ఠానం వైఖరితో కేడర్ కు ఏం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట.
నంద్యాలపై శిల్పా ఫ్యామిలీకి పట్టు
కర్నూలు జిల్లాలోని నంద్యాలపై శిల్పా ఫ్యామిలీ ఎప్పుడో పట్టు సాధించింది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగానూ వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చిన శిల్పా తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకోగలిగారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీలోకి జంప్ కొట్టిన శిల్పా బ్రదర్స్.. తమకు దక్కిన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంది. ఆ ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డి.. యువ నేత భూమా బ్రహ్మానందరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఆపై రాజకీయాలంటేనే విరక్తి కలిగిందో, ఏమో తెలియదు గానీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న మోహన్ రెడ్డి.. నంద్యాల నుంచి తన కుమారుడు శిల్పా రవికిశోర్ రెడ్డిని బరిలోకి దింపారు. సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మొత్తంగా ఇప్పుడు శిల్పా ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ ఫ్యామిలీకి మస్తు ప్రాధాన్యం దక్కాలి. అయితే ప్రాధాన్యం మాట అటుంచి ఆ ఫ్యామిలీ అంటే అసలు లెక్కే లేదన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారట.
మూడింటిలో ఒక్కటీ ఇవ్వలేమన్నారట
ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగూ వైసీపీదే హవా అని భావించిన శిల్పా రవికిశోర్ రెడ్డి.. తన సతీమణి నాగినిరెడ్డిని మునిసిపల్ చైర్మన్‌గా చూడాలని కలలు కన్నారట. ఆ క్రమంలోనే పట్టణంలోని 36వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యేలా చేసుకున్నారు. అయితే మునిసిపల్ చైర్ పర్సన్ పదవిని ముస్లింలకు కేటాయించిన జగన్.. శిల్పా ఫ్యామిలీకి షాకిచ్చారట. అయితే అధిష్ఠానం ఆలోచన ఎలా ఉందోలే అనుకున్న రవికిశోర్ రెడ్డి కనీసం వైస్ చైర్ పర్సన్ పదవిని అయినా తన సతీమణికి ఇప్పించుకోవాలనుకున్నారట. ఈ విషయంలోనూ శిల్పా ఫ్యామిలీకి షాకిచ్చిన జగన్.. ఓ వైస్ చైర్ పర్సన్ పదవిని బలిజలకు కేటాయించారట. అక్కడికి మనసు చంపుకుని రెండో వైస్ చైర్ పర్సన్ పదవి అయినా ఇవ్వాలని రవికిశోర్ రెడ్డి అడిగితే.. అది కూడా ఇవ్వలేమని, వేరే వర్గానికి ఇస్తామని జగన్ చెప్పేశారట. దీంతో ఒకే ఇంటిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా.. తమను పార్టీ అధిష్ఠానం అస్సలు లెక్కలే చేయడం లేదని ఇటు రవికిశోర్ తో పాటు అటు చక్రపాణి రెడ్డి మదనపడిపోతున్నారట.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే











