ఇసుక విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంత లోపభూయిష్టంగా ప్రజలను నానా అగచాట్లకు గురిచేస్తున్నదో అందరికీ తెలిసిన సంగతే. అదే సమయంలో.. తాము తీసుకువచ్చిన ఇసుక విధానం అనేది.. ప్రజలకు చేటుచేస్తున్నదని, పనిలోపనిగా పార్టీకి కూడా చేటు చేస్తున్నదని జగన్మోహనరెడ్డి కూడా గుర్తించారు. అందుకే కనీసం ఒక ఏడాది కూడా గడవక ముందే.. తాము తెచ్చిన ఇసుక విధానాన్ని సమూలంగా తామే మార్చేశారు. ఇలాంటి నేపథ్యంలో కొత్త ఇసుక విధానం కూడా అంతే అవకతవకలుగా ఉన్నదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇసుకకు సంబంధించి.. తవ్వకం, లోడింగ్ ఏ చిన్న కాంట్రాక్టు దొరకబుచ్చుకున్నా సరే.. ఆ ఒక్క నెపం మీద వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎడాపెడా దోచేసుకుంటున్నాయనే ఆరోపణలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కర్నూలులో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా తాము సమానదూరంలో ఉంటామని, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కదానితోనూ పొత్తు పెట్టుకునేదే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. రాయలసీమకు నీటి ప్రాజెక్టుల పరంగా న్యాయం చేయకుండా జగన్ సర్కారు కూడా ద్రోహం చేస్తోందని అభివర్ణించారు. రాయలసీమ అభివృద్ధి అనేది తమ బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుందని కూడా వాక్రుచ్చారు. ఇవన్నీ సాధారణంగా ఆయన ఎప్పుడూ పాడే పాటలే అనుకోవచ్చు.. అయితే.. చిత్రంగా.. చంద్రబాబు పాలనలో ఒక్క విషయం మాత్రం భేషుగ్గా ఉన్నదంటూ కితాబిచ్చారు.
ఇసుక లభ్యత అనేది చంద్రబాబునాయుడు పాలన కాలంలో.. చాలా చవగ్గా దొరికేదని.. జగన్ కొత్త విధానాలు తెచ్చిన తర్వాత.. ఇసుక ధరలు మండిపోతున్నాయని సోము వీర్రాజు అన్నారు. ఇసుక ముసుగులో వైసీపీ నాయకులు యథేచ్ఛగా దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బంగారం దొరుకుతున్నది గానీ.. ఇసుక మాత్రం దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబునాయుడు తీరు గురించి నిత్యం అనేక విమర్శలు చేస్తూ ఉండే సోము వీర్రాజు.. ఇసుక సరఫరా విషయంలో ఆయన పాలననే కీర్తించడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కనిపిస్తోంది.
Also Read: చంద్రబాబువి బూతులైతే.. మరి వైసీపీ మంత్రులవి?