శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ జెన్‌కో పూర్తి సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువున ఉన్న ప్రకాశం బ్యారేజికి భారీగా నీరు చేరుతోంది. దీంతో భారీగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగునీరు వృథా అవుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజిలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో అదనపు నీటిని నిల్వ చేయలేక సముద్రంలోకి విడిచిపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పులిచింతల ప్రాజెక్టుకు ప్రస్తుతం 39,700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టు వద్ద తెలంగాణా జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 7,200 క్యూసెక్కుల నీరు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి విడుదల అవుతోంది. మరోవైపు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
మరోవైపు జలవివాదం పరిష్కారం కావాలనే ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్ లేఖ రాశారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడమే రాయలసీమ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. అమరావతిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గతంలో సీఎం కేసీఆర్ అంగీకరించడమే కాకుండా ప్రోత్సహించారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల సామర్థ్యం నిల్వ ఉన్న సమయంలో విద్యుదుత్పత్తి మొదలు పెట్టాల్సి ఉండగా 800 అడుగల కంటే తక్కువ ఉండగా తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి వచ్చిన నీరు వచ్చినట్లుగానే వదిలేయాల్సి వస్తోందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో సాగు నీటి కష్టాలు తప్పవని సజ్జల హెచ్చరించారు.










