ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని నోటికి పనిచెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని చేసినా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని, ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుద్ది, జ్ఙానం తెచ్చుకోవాలని కొడాలి హితవు పలికారు. అందరూ కలసినా జగన్ చిటికెనవేలుని కూడా పీకలేరన్నారు. తీరుమార్చుకోకుంటే నిమ్మగడ్డ…జగననాధ రథ చక్రాల కిందపడి నలిగిపోతారని మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాపైనా కొడాలి ప్రతాపం చూపించారు. పనికిమాలిన పత్రికలు, పనికిమాలిన టీవీ ఛానళ్లు ఎంత మొత్తుకున్నా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని మంత్రి కొడాలి ఎద్దేవా చేశారు.
Must Read ;- నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్లుంది: రోజా
నోటీసులిచ్చిన ఎన్నికల కమిషన్..
మంత్రి కొడాలి నాని మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేశారు. మీడియా ఫుటేజ్ పరిశీలించిన ఎస్ ఈ సీ, సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తి గతంగా లేదా సహయకునితో వివరణ పంపాలని ఆదేశించింది. ఎస్ ఈ సీ నోటీసులపై మంత్రి కొడాలి నాని ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.
కొడాలి నాని స్పందన..
ఎస్‌ఈసీ ఇచ్చిన షోకాజు నోటీసులపై స్పందిస్తూ.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా నోరు నొక్కితే ఇంకొకరు మాట్లాడుతారు.. సలహాలు ఇస్తే నోటీసులు ఇస్తారా? నేనేం వాళ్లని ఆసుపత్రిలో చేర్పిస్తానని చెప్పలేదు.. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయించుకోమని సలహా ఇచ్చాను.. అందులో తప్పేముంది. నా సలహా పాటించాలా వద్దా అనేది వాళ్లిష్టం. చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఎస్‌ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే ఆలోచన లేదు. నా వివరణపై సంతృప్తి చెందకపోతే ఉరివేస్తారా? ఎస్ ఈసీ పక్షపాతం లేకుండా శిక్షిస్తుందనే భావన రావాలి. అలా కాకుండా.. ఎన్నికల కమిషన్ ఒక పార్టీకో.. ఒక వర్గానికో అనుకూలంగా పనిచేస్తుందని అనిపించినపుడు విమర్శించడం సర్వసాధారణం. నా మాటలను ఎన్నికల కమిషనర్ అర్థం చేసుకుని పద్ధతి మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.’