రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి ఆయనకు పడని వారిపై ఇష్టమొచ్చినట్లు ఇరుచుకుపడ్డారు. మంగళవారం నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో ఇళ్ళపట్టాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న సీఎం జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందిరపై ఉందన్నారు. జగన్ వెనుక ఉన్నానన్న ఆక్రోశంతో ఏబీఎన్ రాధాకృష్ణ , టీవీ 5 బీఆర్ నాయుడు , ఈనాడు రామోజీరావులు వారి ఛానల్స్‌లో ఇష్టమొచ్చినట్లు తన గురించి వేసుకోవచ్చని, పత్రికల్లో రాసుకోవచ్చని , ఐ డోంట్ కేర్ అని మంత్రి నాని అన్నారు. ‘మీ ఛానల్స్ ఎంత , మీ బతుకులెంత.. అవి టీడీపీ తొట్టిగ్యాంగ్ చూసే ఛానల్స్.. సీఎం జగన్‌కు రాజకీయంగా అంగుళం హాని తలపెడితే మీకు అడుగు దిగుద్దని’ హెచ్చరించారు. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకు ఉండాలన్నారు. తనలాంటి వారు జగన్ వెనుక ఉండి చంద్రబాబును, ఆయన పార్టనర్‌ను , లోకేష్‌ను విమర్శిస్తే బూతుల మంత్రని అంటున్నారని , మీ ఇష్టమొచ్చినట్టుగా హెడ్డింగ్‌లు పెట్టుకున్నా లెక్కచేసేది లేదన్నారు. జగన్‌ను ఒక మాట అన్నవారిని తిరిగి పది మాటలు అంటామన్నారు . సీఎం జగన్ పది కాలాల పాటు చల్లగా ఉంటే ప్రతి ప్రభుత్వ పథకంలోనూ పేదలను భాగస్వాములుగా చేస్తారన్నారు . అలాంటి జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి దేవుడు , తండ్రి రాజశేఖరరెడ్డి , ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు.
Must Read ;- మంత్రి కొడాలి నానికి జగన్ తలంటారా?