తెలంగాణలో రాజన్నరాజ్యం నినాదంతో పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన వైఎస్ షర్మిల గురువారం ఉద్యోగాల భర్తీ డిమాండ్‌తో ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 1.9లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే జరగాలని డిమాండ్ చేస్తూ..72గంటల పాటు దీక్షకు దిగారు. అయితే సాయంత్రం 5:15వరకే అనుమతి ఉందంటూ పోలీసులు దీక్షను భగ్నం చేసే యత్నం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పలుచోట్ల పోలీసులతో జరిగిన పెనుగులాటలో షర్మిల చేతికి గాయమైంది. పోలీస్ స్టేషన్‌కి తరలించేందుకు పోలీసులు సిద్ధపడగా స్టేషన్‌లోనే దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద షర్మిలను దిగబెట్టారు పోలీసులు. రెండో రోజుకూడా షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. చేతికి కట్టుతోనే దీక్ష చేస్తున్నారు. ఇక దీక్షలో షర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ది మనసు కాదని..బండ రాయని వ్యాఖ్యానించడంతోపాటు చాలా విమర్శలు చేశారు.
సాక్షిపై సెటైర్
అదంతా ఒక ఎత్తైయితే షర్మిల దీక్ష చేస్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు,కెమెరామెన్లు అడ్డుగా ఉన్నారని తప్పుకోవాలని చెప్పారు. అయితే ఈ సమయంలో మీడియా ప్రతినిధులు కవరేజీ చేస్తున్నామని చెప్పడంతో ‘’మీరే అట్లా చేస్తే ఎట్లా .. మేం దీక్ష చేస్తున్నది జనాల కోసమా..మీ కోసమా.. కోఆపరేట్ చేయండి. మధ్యలో ఉన్నవాళ్లు పక్కకు వెళ్లండి..ఆ అయిదు కెమెరాలు తీసేయాలి అని సూచించారు. ఈ లోగా సాక్షి జర్నలిస్టు ఆ ఛానెల్ పేరు చెప్పడంతో షర్మిల సెటైర్ వేశారు. కవరేజ్ చేసింది చాలు..ఎలాగూ సాక్షి మా కవరేజీ ఇవ్వదు..తప్పుకోవాలని అని సూచించారు. పక్కనే ఉన్న వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ చేతితో తట్టారు. షర్మిల నవ్వుతూనే ఈ సెటైర్ వేశారు. విజయమ్మ కూడా నవ్వుతూనే వారించారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో సంచలనం రేపాయి.
తొలుత ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో కథనాలు..
ఈ వ్యాఖ్యలతో చర్చ కూడా మొదలైంది. వైఎస్ జగన్‌కి, షర్మిలకు విభేధాలు వచ్చాయని, తెలంగాణలో పార్టీ పెడుతున్నారని తొలుత ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో కథనాలు వచ్చాయి. అలాంటివేమీ లేవని షర్మిల ఖండన కూడా ఇచ్చారు. అయితే తరువాత పార్టీ పెట్టడం ఖాయమైంది. తరువాత కూడా విభేదాలు లేవనే ఆ కుటుంబంలోని అందరూ వ్యాఖ్యానించారు. విజయమ్మ ఇటీవల రాసిన లేఖలోనూ..విబేధాల్లేవనే చెప్పారు. తాజాగా సాక్షిలోనూ కవరేజీ రాదని డైరెక్ట్‌గా, బహిరంగంగా షర్మిల వ్యాఖ్యానించారంటే..విభేదాలు వచ్చాయా..లేక డైవర్ట్ చేసే వ్యూహామా అనే చర్చ మొదలైంది. అంతేకాదు.. దీక్ష శిబిరం వద్ద ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతికి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
కవరేజీ విషయంలో..
ఇక షర్మిల దీక్ష కవరేజీ విషయంలో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు మెయిన్ ఫస్ట్ పేజీ (తెలంగాణ/హైదరాబాద్ ఎడిషన్)లో మొదటిపేజీలో కవరేజీ ఇచ్చినా అత్యధిక కవరేజీ ఇచ్చింది ఆంధ్రజ్యోతి. మాస్టర్ హెడ్ పక్కకు జరిపి మరీ కవరేజీ ఇచ్చింది. దీక్ష లైవ్ విషయంలోనూ, అప్ డేట్స్ విషయంలో ఓ టీంని ఏర్పాటు చేసి మరీ బ్రేకింగ్‌లు, లైవ్ లు అందించింది ఏబీఎన్. ఇక వైఎస్ జగన్ సొంత పత్రిక సాక్షి మొదటిపేజీలోనే కవరేజీ ఇచ్చింది. గతంలో కంటే షర్మిల వార్తల విషయంలో కొంత బెటర్‌గానే స్పందించిందని చెప్పవచ్చు. అందుకు షర్మిల వ్యాఖ్యలు కారణమా, విజయమ్మ జోక్యమా, నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రాధాన్యం ఇచ్చారా అనేది వేరే అంశం. కవరేజీ విషయంలో ( వివేకా కుమార్తె సునీత అంశం తప్ప)మొదటిపేజీలో త్రీసీ (త్రీ కాలమ్స్) ఐటంగా ఇచ్చారు. రెండోపేజీ తరువాయి కూడా త్రీసీ ఇచ్చారు. ఈనాడు కూడా ఫస్ట్ పేజీలో ఇచ్చినా.. పేజీ చివరి భాగంలో ప్రచురించింది.
Must Read ;- ఆరోగ్యం క్షీణించినా దీక్ష కొనసాగిస్తున్న షర్మిల..
వివేకా కుమార్తె సునీత..సాక్షికి కనిపించలేదా..
సాక్షిలో అంత కవరేజీ ఇచ్చినా..అక్కడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న కీలక చర్చాంశాల్లో వైఎస్ వివేకా హత్య కేసు అంశం కూడా ఒకటి. సీబీఐ అధికారులు ఈ కేసులో విచారణ కూడా చేస్తున్నారు. వివేకా హత్యకేసులో నిజాలు నిగ్గుతేల్చాలని వివేకా కుమార్తె డా.సునీత ధిల్లీ వెళ్లి సీబీఐ అధికారులను కలిశారు. పలు సంచలన ఆరోపణలు చేశారు. పరోక్షంగా బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అదే సమయంలో సాక్షులు మరణించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో విజయమ్మ ఇటీవలే ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిజాలు నిగ్గుతేల్చాలని, వివేకా తమ కుటుంబ సభ్యుడేనని, తాము కూడా ఈ ఘటనలో దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అయితే షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మతో పాటు వైఎస్ . వివేకా కుమార్తె డా.సునీత కూడా హాజరయ్యారు. షర్మిలకు సంఘీభావం తెలిపారు. విజయమ్మ, షర్మిల, సునీత ముగ్గురూ నవ్వుతూనే పలకరించుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఆయా పత్రికలు ఎవరెవరి పేర్లు రాయాలనేది వారి ప్రాధాన్యతలకు సంబంధించిన అంశమే కాని.. వివేకా హత్య కేసు విషయంలో పోరాడుతున్న డా.సునీత పేరుకు కూడా జగన్ సొంత పత్రిక సాక్షిలో చోటు ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. షర్మిల దీక్షపై నాలుగు ఫొటోలను సాక్షి ప్రచురించినా ఒక్క ఫొటోలోనూ డా.సునీత కనిపించలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఫొటోలు ప్రచురించినా..సాక్షిలో మాత్రం రాలేదు. బాబాయి హత్య కేసు విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిపై రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో..సునీతకు సంబంధించిన ప్రస్తావన కూడా సాక్షిలో రాకపోవడం చర్చకు కారణం అవుతోంది.