భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ప్రస్తుత ఎన్నిక కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునిల్ అరోరా పదవీ కాలం (ఈ రోజు) ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన వ్యక్తిని ప్రధాన కమిషనర్‌గా నియమించనున్నారు. కొన్నాళ్లుగా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత కమిషనర్లలో సీనియర్‌గా ఉన్న సుశీల్ చంద్రకు అవకాశం దక్కనుంది. ఏప్రిల్ 13న సుశీల్ చంద్ర పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా సుశీల్ చంద్ర పదవీ కాలం వచ్చే ఏడాది అంటే…2022 మే 14వరకు ఉంది.
ఐఆర్ఎస్ నుంచి రెండో అధికారి..
1980 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి సుశీల్ చంద్ర. IRS నుంచి భారత ఎన్నికల ప్రధాన కమినర్ స్థాయికి వచ్చిన రెండో వ్యక్తిగా నిలిచారు. గతంలో 2004 ఫిబ్రవరి 8 నుంచి 2005 మే 15వరకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేసిన టి.ఎస్.కృష్ణ మూర్తి IRS అధికారే. ఇక సుశీల్ చంద్ర విషయానికి వస్తే.. IIT రూర్కీలో బీటెక్ పూర్తి చేశారు. డెహ్రాడూన్ DAV కళాశాల నుంచి న్యాయశాస్త్రంలోనూ పట్టా పొందారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో చేరారు. అనంతరం 1980లో ఇండియన్ రెవెన్యూ సర్వీసు (IRS)కి ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం పలు రాష్ట్రాల్లో సేవలందించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ధిల్లీ, ముంబైలో ఆదాయపు పన్ను శాఖలో కీలకంగా వ్యవహరించారు. ఆదాయపు పన్ను శాఖ కమిషర్ (అప్పీల్స్)గా పనిచేయడంతో పాటు ప్రధాన కార్యాలయ పరిధిలో డైరక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, గుజరాత్‌లో డైరక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరించారు. పలు దేశాల్లో శిక్షణ కూడా పొందారు.
2019లో భారత ఎన్నికల కమిషనర్‌గా..
2016లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ (ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉండగానే 2019లో భారత ఎన్నికల కమిషనర్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 38ఏళ్ల పాటు భారత రెవెన్యూ సర్వీసులో సేవలందించిన సుశీల్ చంద్ర నల్లదనం వెలికితీత, వివాదాల పరిష్కారం, పన్ను ఎగవేతదారుల నుంచి పన్నులు రాబట్టడం, దేశంలో పన్ను చెల్లింపు దారుల సంఖ్యను దాదాపు 24రెట్లు పెంచడంలో కీలకంగా వ్యవహరించారని చెబుతారు. పలు దేశాల మధ్య పన్ను ఎగవేత దారుల జాబితాను పంచుకోవడం, బినామీలను అరికట్టేలా చట్టాల రూపకల్పనలో కీలక సూచనలు ఇవ్వడం, ఆదాయపు పన్ను శాఖలో ఆటోమెషిన్ నోటీసుల జారీ విధానాన్ని ప్రవేశపెట్టడం లాంటి కార్యకలాపాల్లో భాగస్వాములుగా ఉన్నారని చెబుతారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన డీమానిటైజేషన్‌లో ప్రధాన భూమిక పోషించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు..
కాగా 2022మే 14 వరకు సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉండనున్నారు. సుశీల్ చంద్ర నేతృత్వంలోనే గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడే మరో విషయం ఏంటంటే.. మే 14నాటికే యూపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది
Must Read ;- పంజాబ్ ప్రభుత్వం ఈయన్నే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది