భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన తన వారసుడిగా సీనియార్టీ ప్రకారం ఎన్వీ రమణను ప్రతిపాదిస్తూ నిబంధనల ప్రకారం కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ మేరకు రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడింది. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రెండో వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. అంతుకు ముందు జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి..
ఇక జస్టిస్ ఎన్వీ రమణ విషయానికి వస్తే.. సుప్రీంకోర్టు సీజేగా 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ఎన్వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. ఆయన 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. వివిధ హోదాల్లో పని చేశారు. 1983 ఫిబ్రవరి 10న బార్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్ 27న ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు.
అవాంతరాలు అధిగమించి..
తన ప్రాంతానికి చెందిన వారికి దేశంలో అత్యున్నత పదవి లభిస్తుందంటే.. సాధారణ పరిస్థితుల్లో అంతా హర్షిస్తారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేస్తూ సీజేకు లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు కూడా బహిర్గతం చేసింది వైసీపీ ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడంతోపాటు అమరావతిలో ఆయన సంబంధీకులు భూములు కొన్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపిన సుప్రీంకోర్టు అన్ని అంశాలు పరిశీలించాకే జస్టిస్ ఎన్వీ రమణను సీజేగా సిఫారసు చేస్తున్నామని ప్రకటించింది.
Must Read ;- ఎన్వీ రమణకు లైన్ క్లియర్.. జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
కక్ష పూరిత ఆరోపణలేనంటూ..
అయితే ఇవి వైఎస్ జగన్ కక్ష పూరితంగా చేసిన ఆరోపణలేనని కొన్ని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఆరోపణల వెనుక గతంలో దేశ స్థాయిలో ఒక పవిత్రమైన విభాగంలో సేవలందించిన వ్యక్తి కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆయన సంబంధీకులకు ఏపీ ప్రభుత్వంలో అడిషనల్ హోదా కూడా వచ్చింది. తనకు రాని అవకాశం తన ప్రాంతానికి చెందిన వ్యక్తికే వస్తుంటే ఇలా ఎందుకు చేస్తారు అనే ప్రశ్నతో పాటు అనుభవం జాస్తి..అత్యున్నత హోదా నాస్తి చర్చకూడా రాజకీయాల్లో నడిచింది. మొత్తం మీద ఎన్ని అవాంతరాలు ఎదురైనా జస్టిస్ ఎన్వీ రమణ సరోన్నత న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. ఇక కేవలం సీనియార్టీ ప్రకారమే జస్టిస్ ఎన్వీ రమణకు ఈ హోదా దక్కనుందనుకుంటే పొరపాటే. ఆయన ఇచ్చిన తీర్పులు, అంకితభావం కూడా తోడయ్యాయని చెప్పవచ్చు. తన కెరియర్లో దాదాపు 13వేలకుపైగా కేసులను పరిశీలించిన ఆయన ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే..మహిళల విషయంలో జస్జిస్ ఎన్వీ రమణ ఇచ్చిన తీర్పు..ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గృహిణుల శ్రమ..భర్త ఆదాయం కంటే ఎక్కువే..
2014లో ఢిల్లీలో ఓ ప్రమాదంలో భార్యాభర్తలు చనిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త లెక్చరర్ కాగా భార్య గృహిణి. అయితే అప్పటికే బీమా ఉన్నప్పటికీ బీమా సంస్థ పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడంతో బాధిత కుటుంబానికి చెందినవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ కుటుంబానికి రూ. 40.17 లక్షల బీమా పరిహారాన్ని ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అయితే చనిపోయిన వ్యక్తి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అంత బీమా పరిహారం రాదని, కేవలం ఒకే సంపాదనపరుడు ఆ కుటుంబంలో ఉన్నాడని బీమా సంస్థ వాదించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ అనంతరం పరిహారాన్ని రూ. 22 లక్షలకు తగ్గిస్తూ తీర్పు వెలువడింది.
బాధిత కుటుంబం సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహిణులు చేస్తున్న శ్రమను కూడా ఆదాయంగానే పరిగణనలోకి తీసుకోవాలని, ఇంటి పని చేయడంలోనూ శ్రమ ఉందని, కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా, వారి ఉద్యోగ, ఉపాధి మార్గాలకు సహకరించేలా గృహిణులు శ్రమపడుతున్నారని వ్యాఖ్యానించడంతోపాటు గృహిణులకు ఆదాయం లేదనే వాదనకు అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. గృహిణి చేస్తున్న చాకిరిని విస్మరించలేమని, కచ్చితంగా ఆదాయంగానే తీసుకోవాలని సూచిస్తూ సదరు బీమా కంపెనీ రూ.30.20 లక్షలను 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తుది తీర్పు ఇచ్చింది. అంతేకాదు..ఈ మేరకు మార్గదర్శకాలను కూడా ఖచ్చితంగా రూపొందించాలని బీమా సంస్థలకు పరోక్షంగా సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మహిళలు చేసే ఇంటిపని భర్త చేసే ఉద్యోగానికి ఏమాత్రం తక్కువ కాదని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. జస్టిస్ ఎన్వీ రమణ 2001లోనూ లతా వాధ్వా కేసులో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మనదేశంలో పురుషుల కన్నా స్త్రీలే ఇంటి పనులు ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో కుటుంబంలో మంచి చెడులను భుజాన వేసుకుంటారని, ఆహారం, దుస్తులు, ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిల్లల అవసరాలను చూడటం, వస్తున్న ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నిర్వహించడం వంటివి సవాళ్లతో కూడుకున్నవేనని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ఇక మరికొన్ని తీర్పులు పరిశీలిస్తే..
సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్, 2019 కేసులో సుప్రీంకోర్టు సీజే కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. 2016లో నబమ్ రెబియా, బమాంగ్ ఫెలిక్స్ VS డిప్యూటీ స్పీకర్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసం. ముఖ్యమంత్రి, మంత్రి మండలి, స్పీకర్‌లను సంప్రదించకుండా అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలంటూ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవల నిలిపివేత జరిగింది. ఈ కేసులో ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్ కేసులో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను అనుమతించాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఎండీ.అన్వర్ వర్సెస్ ఎన్‌సీటీ ఆఫ్ ఢిల్లీ, 2020 కేసులో మానసిక అనారోగ్యం, మతిస్థిమితం లేకపోవడం వంటి కేసుల్లో కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించాలని తీర్పు చెప్పారు. జస్టిస్‌లు ఎన్.వీ.రమణ, ఎస్.ఏ నజీర్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం మానసిక రుగ్మతలకు నిర్వచనాన్ని వివరించింది. ఇవే కాదు.. రాష్ట్ర-కేంద్ర పన్నుల వివాదం, నదీ జలాల వివాదాలు, రాష్ట్రాలకు ఆర్థిక అంశాల్లో స్వేచ్ఛ తదితర అంశాల్లో కీలకమైన తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఎన్వీ రమణ కూడా కీలకంగా వ్యహరించారు.
Also Read ;- ఇలా జరుగుతుందని తెలిసే.. జగన్ అలా చేశారా?