తమ రాష్ట్రంలో 8 విడతల్లో పోలింగ్‌పై మమత విమర్శలు.. తిరుపతి,సాగర్ షెడ్యూల్ జాప్యంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్, పుదుశ్చేరి అసెంబ్లీ ఎన్నికలతోపాటు కేరళలోని మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అయితే ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా శుక్రవారం వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటే వీటికి కూడా నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావించినా..ఎన్నికల సంఘం నుంచి ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. దీంతో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మమత ఆరోపణలు ఇవీ..
తమిళనాడు, పుదుశ్చేరి, కేరళల్లో ఒకే విడత ఎన్నికలు జరగనుండగా అసోంలో మూడు విడతల్లో, పశ్చిమ బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. కాగా పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికల నిర్వహణపై మమతా బెనర్జీ పరోక్షంగా ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి లాభం చేకూర్చేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. 8 విడతల్లో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనుండగా మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న ముగియనున్నాయి. ఈ నిర్ణయంపై మమత పలు ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 6న ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసే సమయానికి..తమ రాష్ట్రంపై అంతా కలసి వస్తారని, ఆ యత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు మమత. అంతే కాకుండా ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటం ఏంటని ప్రశ్నించారు. టీఎంసీకి గట్టి పట్టున్న సౌత్ 24 పరగణా జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండడం కూడా మమత ఆగ్రహానికి కారణమై ఉండవచ్చనే చర్చ నడుస్తోంది. అంతే కాదు.. ఆ ప్రాంతాల్లో టీఎంసీకి ధీటైన అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై దాడికి యత్నం జరిగింది కూడా ఆ ప్రాంతంలోనే కావడం గమనార్హం.
Must Read ;- గుర్తుంచుకోండి.. మే2న నేను చెప్పిందే నిజమవబోతోంది: ప్రశాంత్ కిషోర్
తిరుపతి, నాగార్జునసాగర్‌లలో..
కన్యాకుమారి ఎంపీ (కాంగ్రెస్) వసంతకుమార్ గత ఏడాది ఆగస్టు 28న చనిపోయారు. ఇక కేరళలోని మల్లాపురం లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచిన పీకే కున్హాలికుట్టి గత ఏడాది డిసెంబరు 23న తన పదవికి రాజీనామా చేశారు. కేరళలో ముస్లిలీగ్ కీలక నేతగా ఉన్న కుట్టి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కాగా తిరుపతి ఎంపీ (వైసీపీ) బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబరు 16న కొవిడ్ చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక నాగార్జునసాగర్ ఎమ్మెల్సే (టీఆర్ఎస్) నోముల నర్సింహయ్య గత ఏడాది డిసెంబరు 1న అనారోగ్యం కారణంగా చనిపోయారు. మొత్తం మీద దేశంలోని 16 రాష్ట్రాల్లో 30పైగా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆరునెలల్లోపు ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వాటిలో ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లోని మల్లాపురం, కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు మాత్రమే షెడ్యూల్ విడుదలైంది. మిగతా వాటికి త్వరలోనే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.అది అనివార్యంగా జరగాల్సి ఉంటుంది.
జాప్యంపై చర్చ..
శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా మాట్లాడుతూ తిరుపతి, నాగార్జునసాగర్‌తో పాటు ఉప ఎన్నికలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే మరో షెడ్యూల్ వస్తుందని అంతా భావించినా ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ మాత్రం విడుదల కాలేదు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు, లేని ఉద్దేశాలు ఆపాదించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. అయినప్పటికీ ఈ అంశంపై పలు కోణాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల అభివృద్థి మండలి సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మరుసటి రోజు కూడా ఆయన తిరుపతిలోనే ఉండనున్నారు. ఇందుకోసం భారీ భధ్రత కూడా ఏర్పాటు చేశారు.ఈ పర్యటనలో తిరుపతి లోక్‌సభ విషయంపైనా బీజేపీ నాయకులతో సుదీర్ఘ చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాకలక్ష్మిని ఆ పార్టీ ఖరారు చేసింది. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో గురుమూర్తి అభ్యర్థిత్వాన్నే వైసీపీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎటొచ్చీ బీజేపీ-జనసేనల మధ్య అవగాహన కుదరడమే ఆలస్యంగా కనిపిస్తోంది.
ఖరారు కాని బీజేపీ అభ్యర్థులు
గతంలో ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ నుంచి బి.శ్రీహరి రావు పోటీ చేయగా 16125 ఓట్లు వచ్చాయి. జనసేనతో ఒప్పదంలో భాగంగా బీఎస్పీ నుంచి డి.శ్రీహరిరావు పోటీ చేయగా ఆయనకు 20971ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 25781ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము గెలుస్తామని బీజేపీ చెబుతోంది. అయితే బీజేపీ-జనసేన మధ్య అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అమిత్ షాతో మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నాగార్జునసాగర్ విషయానికి వస్తే.. బీజేపీకి గతంలో డిపాజిట్ కూడా రాలేదు. అయితే దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో తమ పార్టీ పట్టు నిలుపుకుందని, తెలంగాణలో తమ ఇమేజ్ పెరిగిందని, దానికి తోడు ఇటీవల నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను బీజేపీ చేర్చుకున్న నేపథ్యంతో ఇక్కడా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. మొత్తం మీద తిరుపతి, నాగార్జునసాగర్ లలో బీజేపీకి అభ్యర్థి ఎంపిక విషయం కూడా పరీక్షా సమయంగా మారింది. కాకతాళీయమే అయినా.. ప్రస్తుతానికి షెడ్యూల్ విడుదల కాకపోవడం, ఈ రెండు చోట్ల బీజేపీకి అభ్యర్థి విషయంలో మరింత సమయం దొరకడంపై పార్టీల్లో చర్చ నడుస్తోంది.
Also Read ;- ఎన్నికల షెడ్యూలుకు గంట ముందు రాష్ట్రాల వరాల జల్లు..!