అధికారంలోకొచ్చి 22 నెలలవుతున్నా నిరుపేదలకు ఒక్క ఇల్లూ కట్టివ్వలేని ముఖ్యమంత్రికి, నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి 2వ వార్డుకి చెందిన 320 ఇళ్ల యజమానులు గురువారం టిడిపి జాతీయ కార్యాలయంలో నారా లోకేష్‌ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇళ్లు కట్టుకుని 45 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ ఇళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కారు ఇళ్లు కూలగొడుతుందేమోనని భయమేస్తోందన్నారు. ఇటీవలే ఆత్మకూరులో ఇళ్లు పడగొట్టించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తమ ఇళ్లను కూలగొట్టిస్తారనే ఆందోళన నెలకొందన్నారు. “నేను గెలిస్తే మీ ఇళ్లు పీకేస్తానని భయపెట్టి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా రోజుకొక చోట పేదల ఇళ్లు కూలగొట్టించడం చాలా దారుణం“ అని లోకేష్ పేర్కొన్నారు. తాడేపల్లి 2వ వార్డులో ఒక్క ఇటుక ముట్టుకున్నా, నేనే స్వయంగా వచ్చి బాధితుల తరఫున ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
Must Read ;- గూడు చెదిరింది : ఆత్మకూరులో పేదల ఇళ్లు కూల్చివేత











