తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలతో విజయ్ సేతుపతి ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజనటుడిగా ఆయన బాలీవుడ్ దృష్టిలోను పడ్డాడు. ఏకంగా ఆమిర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా‘లో కీలకమైన పాత్రను చేసే ఛాన్స్ కొట్టేశాడు. తన సినిమాలో ముఖ్యమైన పాత్రల కాంబినేషన్ విషయంలో ఆమిర్ ఖాన్ ప్రమేయం ఉంటుంది. అందువలన ఆయన కాస్త బరువు తగ్గమని విజయ్ సేతుపతికి చెప్పాడట. ఇతర సినిమాలు కూడా చేస్తున్న కారణంగా కంటిన్యుటీ దెబ్బ తింటుందని చెప్పేసి, విజయ్ సేతుపతి కుదరదని అన్నాడట. దాంతో విజయ్ సేతుపతిని ఆ ప్రాజెక్టు నుంచి తప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
మొదట్లో ఈ ప్రచారాన్ని లైట్ గా తీసుకున్న విజయ్ సేతుపతి, ఆ తరువాత స్వయంగా స్పందించవలసి వచ్చింది. “ఆమిర్ ఖాన్ ఎంత గొప్పనటుడో .. అంతకన్నా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. అవసరం లేకపోయినా ఆయన చెన్నై వచ్చి మరీ నాకు కథ వినిపించారు. ఆ కథ నచ్చడం వల్లనే నేను అంగీకరించాను. ఆ పాత్రకు నేను సెట్ అవుతానని ఆయన నమ్మబట్టే చెన్నై వరకూ వచ్చారు. నన్ను బరువు తగ్గమని ఆయన చెప్పనే లేదు. ఆయన చెన్నై వచ్చినప్పుడు ఎంత ప్రేమాభిమానాలతో మాట్లాడారో, ముంబైకి పిలిపించిన్నప్పుడు కూడా అదే అభిమానాన్ని చూపించారు.
ఈ ప్రాజెక్టులో నుంచి ఆయన నన్ను తీసేయలేదు .. అలాగే నేను కూడా తప్పుకోలేదు .. పరిస్థితులు అలా వచ్చాయంతే. లాక్ డౌన్ కి ముందు ఒప్పుకున్న సినిమా ఇది. లాక్ డౌన్ సమయంలో ఆగిపోయిన సినిమా షూటింగులన్నీ, ఆ తరువాత ఒకేసారిగా మొదలైపోయాయి. దాంతో నేను ‘లాల్ సింగ్ చద్దా’ కంటే ముందుకు ఒప్పుకున్న సినిమాలు చేయవలసి వచ్చింది. ఆ కారణంగా నేను ‘లాల్ సింగ్ చద్దా’ చేయలేకపోయాను. అంతే తప్ప ఈ ప్రాజెక్టు కారణంగా ఆమిర్ కు .. నాకు మనస్పర్థలు వచ్చాయనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- సలార్ తో తలపడనున్న విజయ్ సేతుపతి?