బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముద్దుల పట్టి ఐరా ఖాన్ కు తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలవడం అలవాటు. ఆమె మాటలు, చేష్టలు అన్నీ బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ గానే ఉంటాయి.
ఇటీవల లోనావాలా ట్రిప్ వేసి ఆ ఫొటోలను నెటిజన్లకు షేర్ చేశారు. అందాలు ఒలకబోస్తూ చందమామలా కనిపించింది. ఆ బాత్ టబ్.. ఆ స్విమ్మింగ్ ఫూల్ చూస్తుంటేనే ఆమె ఓ హమ్మింగ్ బర్డ్ లా కనిపించేసింది. ఆమెను చూస్తుంటే ప్రపంచంలో ఇంతకన్నా స్వేచ్చా జీవి ఇంకెవరైనా ఉంటారా అని కూడా అనిపిస్తుంది. దర్శకురాలిగా తొలి ప్రయత్నం కూడా చేసేసింది. యూరిపిడెస్ మెడియా నాటకం అది. అందుకే ఇప్పుడు ఇలా విరామాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తోంది.
ఈ సందర్భంగా ఇన్ స్టాలో తన భావాలను పంచుకుంటూ ఇంకా తనకెంతో చేయాలని ఉందని, విరామ సమయంలో ఎంజాయ్ చేసేసి మళ్లీ వచ్చేస్తానంటూ కామెంట్ కూడా పెట్టింది. బాత్ టబ్ లో ఆమె చేతిలో ఓ పుస్తకం కూడా ఉంది. ఆమె చుట్టూతా ఉన్న వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది. చుట్టూ చెట్టూ చేమలు, కొండలూ గుట్టలూ ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదంతా ఆమె కొత్త ఇల్లు.. కొత్త కొలను.. కొత్త టబ్బు అనుకోవాల్సిందే.
Also Read ;- తెలుగు సినిమాకు 20 ఏళ్ల ధ్రువ ‘తారక’ వెలుగులు
మానసిక ఒత్తిడి మాటేమిటి?
ఐరా ఖాన్ మానసికి ఒత్తిడి మాయమైనట్టే ఉంది. తను మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆమె గత అక్బోబరులో ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా తను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఇప్పుడు దాన్నుంచి కోలుకుని కొత్త ప్రయాణానికి సన్నద్ధమవుతోందట. ఆ ప్రయాణం ఎటువైపో చూడాలి. అసలు నేను ఎవరు? దేని గురించి నిరాశ చెందాలి? లాంటి తాత్విక ఆలోచనలు ఆమెను వెంటాడుతున్నాయి. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె ఐరా. ఐరాకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు.
అతడి పేరు జునైద్ ఖాన్. రీనాతో తేడా వచ్చాక అమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆ తర్వాత ఆజాద్ రావు పుట్టాడు. ఐరాలో నిరాశానిస్పృహలు ఎందుకొచ్చాయన్న విషయాన్ని కూడా చూడాల్సిందే. ఆమె మానసిక ఒత్తిడికి కారణాలు ఆమెకే తెలియవట. ఆ కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నానంటోంది. ఒంటరిగా గదిలో ఉండటం వల్ల ప్రయోజనం లేదనుకుని పక్షిలా ఎగురుతూ తెలుసుకోవాలన్న ఉబలాటం ఆమెలో ఉన్నట్టుంది. ఏదో ఒక వ్యాపకం ఉంటే అన్నిటినీ మరచిపోవచ్చని టాటూ బిజినెస్ కూడా చేపట్టింది.
లైంగిక వేధింపుల మాటేమిటి?
చిన్న వయసులోనే ఆమె లైంగిక వేధింపులకు గురైందట. తల్లిదండ్రులు విడిపోయేటప్పటికి ఆమె వయసు చాలా చిన్నది. అందుకే వారు ఎందుకు విడిపోయారో తెలియదట. వారు విడిపోయినా ఆ బాధ ఆమెకు తెలియలేదట. తన 14వ ఏటనే లైంగిక వేధింపులకు గురైనట్టు ఆమె చెప్పింది. ఆ వ్యక్తి తనను ఏంచేస్తున్నాడో తెలిసేది కాదని, తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఆ సమస్య పరిష్కారమైందని ఆమె చెప్పింది. మన జీవితంలో ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలని కూడా ఆమె చెబుతోంది. ఒంటరి తనంలో ఏ మనిషైనా ప్రేమని కోరుకుంటాడు. ఆమె విషయంలో కూడా అదే జరిగింది.
Must Read ;- నిశ్చితార్ధం చేసుకున్న ప్రముఖ గాయని సునీత
మిషాల్ అనే వ్యక్తితో ఆమె సహజీవనం సాగించినట్టు వార్తలు వచ్చాయి. అతని మీద ఉన్న ప్రేమను ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయి.. విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ కొత్త జీవితం. ఫిట్ నెస్ ట్రైనర్ నుపూర్ షీఖరే తో మళ్లీ ప్రేమలో పడినట్టు వార్తలు కూడా వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో ఆమె వర్కవుట్లు చేస్తున్నపుడు అతను కోచ్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ డేటింగులో ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అమీర్ ఖాన్ ఫామ్ హౌస్ లో వీరు పార్టీ చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీరి ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదండీ ఐరా జీవితం.. మీకు ఔరా అనిపించడం లేదూ?
– హేమసుందర్ పామర్తి