రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా .. కవిగా తనికెళ్ల భరణి స్థానం ప్రత్యేకం. ఇన్ని విషయాల పట్ల ఆయనకి మంచి ప్రవేశం ఉన్నప్పటికీ, ఆయనను ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గర చేసింది మాత్రం నటనే అని చెప్పాలి. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రల ద్వారా ఆయన వాళ్లను మెప్పిస్తూ వచ్చారు. నెగెటివ్ పాత్రలను పోషించడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. డిఫరెంట్ బాడ్ లాంగ్వేజ్ తో .. ముఖ్యంగా తెలంగాణ యాసతో కూడిన డైలాగ్ డెలివరీతో ఆయన ఆడియన్స్ నుంచి ఆదరణ పొందారు. కామెడీ టచ్ ఉన్న పాత్రలపై కూడా తనదైన ముద్ర వేశారు. అలాంటి తనికెళ్ల భరణి, తాజాగా ‘ఆలీతో సరదాగా’ వేదిక ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు.
“మొదటి నుంచి కూడా నేను స్నేహితులతో కలిసి ఎక్కువగా తిరిగేవాడిని .. వాళ్లతో కలిసి సినిమాలు చూసేవాడిని. కాలేజ్ రోజుల్లోనే నాలో ఓ రచయిత ఉన్నాడనే విషయాన్ని నా స్నేహితులు గుర్తించి ప్రోత్సహించారు. అలా కాలం గడిచిపోతున్న రోజుల్లో ‘అద్దెకొంప’ అనే ఒక నాటకం రాసి స్టేజ్ పై ప్రదర్శించాను. ఆ నాటకం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. దాంతో ఒక నాటక సమాజం స్థాపించడం .. ముఖ్య అతిథిగా వచ్చిన రాళ్లపల్లిగారితో సాన్నిహిత్యం పెరగడం జరిగిపోయాయి. రాళ్లపల్లి గారు నన్ను ఓ కొడుకులా చూసేవారు .. నేను మా ఇంట్లోకంటే ఎక్కువగా ఆయన ఇంట్లోనే ఉండేవాడిని. ఒక్క మాటలతో చెప్పాలంటే ఆయనే నాకు గురువు .. ఆయనే నాకు దేవుడు.
నటుడిగా నేను కుదురుకుంటున్న సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డిగారి నుంచి కాల్ వచ్చింది. అప్పటికే దర్శకుడిగా ఆయన వైభవం అందుకుంది. అందువలన ఆయన నుంచి కాల్ రాగానే నేను చాలా సంతోషపడిపోయాను. ‘యమలీల’లో ఒక మంచి వేషం ఉంది .. చేయాలి అని ఆయన అనగానే వెంటనే ఓకే చెప్పేశాను. కొన్ని రోజుల పాటు షూటింగు జరిగిన తరువాత, ఒక రోజున కృష్ణారెడ్డిగారు క్లైమాక్స్ లో భాగంగా ఒక సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గరకి వెళ్లి, “సార్ నా పోర్షన్ అయిపోయిందా .. నేను వెళ్లొచ్చునా” అని అడిగాను. “ఎక్కడికి వెళతావయ్యా సాంగ్ ప్లాన్ చేస్తున్నదే నీ మీద” అన్నారాయన. ఆ క్షణంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ సినిమాలో నేను చేసిన ‘తోటరాముడు’ పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తరువాత వరుసగా 26 సినిమాలకి సైన్ చేశాను” అని చెప్పుకొచ్చారు.