(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విజయనగరం జిల్లా రామతీర్థం కూడలిలో పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా భాజపా, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమవుతుండగా…ఇప్పటికే కొందరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజును ముందస్తుగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోము వీర్రాజుతో పాటు పలువురు భాజపా నాయకులను పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
వెల్లంపల్లి రాజీనామా చేయాలి : సోము
‘మా రామతీర్థం యాత్రను అనుమతి లేదంటూ అడ్డుకోవడం సమంజసం కాదు .. జగన్మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలి .. ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.. ఆలయాల పై దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలి .. టీడీపీ రాజకీయ కోణంలో చూస్తే.. మేము హిందువులు మనోభావాల కోసం పోరాడుతున్నాం’ .. అంటూ సోము వీర్రాజు స్పష్టం చేశారు. పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అడుగడుగునా అడ్డంకులు
బీజేపీ, జనసేన రామతీర్థం యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అనుమతి లేదంటూ ముఖ్య నాయకులకు ముందస్తు నోటీసులు, హౌస్ అరెస్టులు చేస్తోంది. విజయనగరం బీజేపీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల వలయాలను దాటుకుని రామతీర్థం ఆర్చి వద్దకు చేరిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, బీజేవైఎం అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: జగన్ సర్కార్‌కు బీజేపీ వార్నింగ్.. క్షణాల్లోనే నాయకుల విడుదల