ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే కంపెనీలు ఏమీ రావని.. ఉద్యోగాలు ఎలా తీసుకొస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడి పాలనతో.. రాష్ట్రంలో పలు కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సముఖత చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ ఆర్థిక రాజధాని వైజాగ్‌కి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తమ శాఖను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. టీసీఎస్ ద్వారా మరో 10 వేల మంది టెక్కీలకి నేరుగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతోపాటు ఇప్పటికే పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి.
విశాఖపట్నంలో పది వేల మందికి ఉపాధి కల్పించే భారీ కార్యాలయాన్ని టీసీఎస్ ఏర్పాటు చేయబోతోంది. మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపిన అనంతరం బుధవారం భారీ ప్రకటన రాబోతోందని ‘ఎక్స్’లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అన్నట్టుగానే.. 24 గంటలు గడవక ముందే విశాఖలో టీసీఎస్ కార్యాలయం ఏర్పాటు కానుందని ఆ సంస్థ ప్రకటించడం విశేషం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కార్పొరేట్ల పెట్టుబడులకు అత్యుత్తమమైన సానుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. వ్యాపారంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే క్రమంలో టీసీఎస్ పెట్టుబడిని ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఐటీ రంగం పునరుజ్జీవం దిశగా ఇది కీలకమైన ముందడుగని ఐటీ వర్గాలు కూడా అంటున్నాయి.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వచ్చే ఐదేళ్లలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టింది. విశాఖ కేంద్రంగా ఐటీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశాఖ మిలీనియం టవర్స్ ఐటీ రంగ సంస్థలకు కేటాయించనుంది. ఏపీ ఏఐ మిషన్ పేరిట పాఠశాల స్థాయి నుంచే బోధన, స్టార్టప్ ఎకో సిస్టం, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తోంది. మొత్తంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగానిది కీలక భూమిక అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య, వ్యాపార, పారిశ్రామి విధానాలను టాటా సంస్థ ఛైర్మన్‌కి మంత్రి లోకేష్ వివరించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రోత్సాహానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తుండగా.. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ఆ దిశగా పెట్టుబడులు రప్పించడంపై ప్రత్యేక చొరవ చూపుతున్నామని లోకేశ్ వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారని. ఆంగ్లం, గణితంలో చురుగ్గా, లాజిక్‌లో దిట్టలుగా ఉంటారని చంద్రశేఖరన్‌తో అన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోందని.. ఇప్పటికే లులూ, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు చేయడానికి ముందుకొచ్చాయన్నారు. తాజాగా టీసీఎస్ కూడా తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధం వ్యక్తం చేయడంతో.. విశాఖ నగరం కాస్త ఇప్పుడు ఐటీ హబ్‌గా రూపురేఖలు మార్చుకోనుందని.. దానికి టీసీఎస్ మణిహారంగా మారుతుందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.