స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఎంత మోటివేట్ చేసినా.. ఎంత గట్టిగా ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. ప్రత్యర్ధుల అధికార బలం, ధన బలం ముందు నిలబడలేకపోయారు. ఇప్పుడు వారి ముందుకు మరో టాస్క్ వచ్చి పడింది. అదే తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నిక. టీడీపీకి ఇప్పుడది అగ్ని పరీక్ష అయింది. చిత్తూరు జిల్లాలో, అందులో ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అటు పంచాయితీలు, ఇటు మున్సిపాలిటీలు.. రెండిటిలోనూ వైసీపీ వార్ వన్‌సైడ్ నడిపించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇంకా ఇతర సీనియర్ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఇంకా రోజా అందరూ ఇప్పుడు ఈ ఎన్నికలపై హార్డ్ వర్క్ చేయనున్నారు. పైగా అధినేత జగన్మోహన్‌రెడ్డి వారికి 4 లక్షలు మెజారిటీ కావాలని టార్గెట్ ఇచ్చాడు.
మనీ పెట్టేదెవరనే ప్రశ్న..
దీంతో ఇప్పుడు టీడీపీకి ఇది హార్డ్ టార్గెట్ గా మారింది. ఒకవైపు బీజేపీ డ్రామాలు.. దానితో కలిసి ఆడుతున్న వైసీపీ హైడ్రామాలు జనానికి ఇఫ్పుడిప్పుడే అర్ధమవుతున్నాయి. సంక్షేమ పథకాలు కాస్తో కూస్తో ఎఫెక్ట్ చూపించినా.. ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ వంటి అంశాలు గట్టి ప్రభావమే చూపిస్తాయి. కాని వీటన్నిటిని ఎక్స్ పోజ్ చేస్తూ టీడీపీ హైలెట్ చేసుకోవాలన్నా.. గట్టి ప్రచారం చేయాలి. అందుకు మనీ కావాలి. కాని అది పెట్టేదెవరనే ప్రశ్న ఇప్పుడు ముందుకొచ్చింది.
గతంలో ఇచ్చినా..
అభ్యర్ధి పనబాక లక్ష్మి తన ప్రచారం వరకు అయితే ఖర్చు భరించుకోవడానికి సిద్ధపడింది. కాని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారానికి ఎవరు పెట్టుకుంటారు? ఇదే ప్రశ్న టీడీపీ నేతలను వేధిస్తోంది. సమావేశాలు జరుగుతున్నాయి.. రివ్యూలు జరుగుతున్నాయి.. కాని ఈ ముక్క మాత్రం ఎవరూ తేల్చటం లేదు. గతంలో ఫండింగ్ ఇచ్చిన పారిశ్రామికవేత్తలు, బిజినెస్ పర్సన్స్ ఇప్పుడు టీడీపీకి అంత టచ్‌లో లేకుండా వెళ్లిపోయారు. టచ్ లో ఉంటే వారి వ్యాపారాలపై వైసీపీ దెబ్బ పడుతుంది మరి.
డబ్బులు పంచకపోతే..
పోలింగ్ అప్పుడు డబ్బులు పంచకపోతే ఓట్లు పడని సీజన్ ఇది. ఇలాంటి టైమ్‌లో ప్రచారానికే డబ్బులు లేకపోతే .. పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు వారిలోవారే చర్చించుకుంటున్నారు. బీజేపీ ఎటూ పోటీలోనే ఉండదని అర్ధమవుతూనే ఉంది. కాస్తో కూస్తో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి.. వైసీపీకి న్యాయం చేయడానికే వారు పోటీ చేస్తున్నారని తెలుస్తూనే ఉంది. అలాంటిది బీజేపీ మాత్రం భారీగా మనీ డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది
అంతా వైసీపీకి అనుకూలంగా ఉన్న వేళ..
ఒకవైపు పోలీసులు, అధికారులు అంతా వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న వేళ.. ఎలాంటి దన్ను లేకుండా ఎలా తలపడేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే అధినేత చంద్రబాబు వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు స్పాన్సర్స్‌ని ఇఫ్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. చూడాలి మరీ.. ఈ వార్‌లో టీడీపీ ఎలా నెగ్గుకొస్తుందో.
Must Read ;- తిరుపతిపై చంద్రబాబు ఫోకస్.. ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్