అందాల తార పూజా హెగ్డేకి తమిళనాట కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దళపతి విజయ్ తో ఆమె ఓ సినిమా కమిట్ అయ్యింది. మొదటిసారిగా ఆమె విజయ్ తో జతకట్టబోతోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. విజయ్ కి ఇది 65వ చిత్రం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పూజాహెగ్డే మొదటిసారిగా తమిళంలో 2012లో పరిచయమైంది. ఆ సినిమా పేరు ముగమూడి. ఆ సినిమా తర్వాతే ఆమెకు తెలుగులోనూ అవకాశాలు వరించాయి.
చాలా గ్యాప్ తర్వాత పూజ తమిళ సినిమా చేస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఇంతకుముందు విజయ్ తో ‘సర్కార్’ చిత్రాన్ని నిర్మించింది. విజయ్ నటించి ‘మాస్టర్’ చిత్రం కూడా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించడం విశేషం. ‘మాస్టర్’ సినిమా నిర్మాణ సమయంలోనే విజయ్ సన్ పిక్చర్స్ తో మళ్లీ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో చాలా బిజీగా ఉంది. అక్కినేని అఖిల్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చేస్తోంది.
అలాగే ప్రభాస్ చేసిన ‘రాధేశ్యామ్’ కూడా విడుదలకు ముస్తాబవుతోంది. మెగాస్టార్ హీరోగా రూపొందే ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరనన నటిస్తోంది. ఇలా దాదాపు నాలుగు చిత్రాలు ఆమె తెలుగులో చేస్తోంది. బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేసింది. రణ్ వీర్ సింగ్ కు జోడీగా ‘సర్కస్’ చేస్తోంది. రోహిత్ శెట్టి రూపొందించే ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతోంది. ఇటు తెలుగు, అటు బాలీవుడ్ తో పాటు తమిళంలోనూ కాలుమోపింది ఈ భామ. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చేసుకుంది పూజా హెగ్డే.