తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికల వేడి రాజుకుంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఆ తర్వాత బీజేపీలో చేరిపోవడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటిదాకా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు చేరారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల… ఉప ఎన్నికకు కారణంగా నిలిచారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందనే చెప్పాలి. ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు గానీ… ఎన్నికల వేడి మాత్రం ఇప్పటికే రాజుకుంది. టీఆర్ఎస్ వర్సెస్ ఈటల… లేదంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య ఫైట్ షురూ అయిపోయిందనే చెప్పక తప్పదు.
హుజూరాబాద్ ఓటర్లు ఎవరివైపు?
కరీంనగర్ జిల్లాలో కీలక అసెంబ్లీ సెగ్యెంట్ గా ఉన్న హుజూరాబాద్ ఆది నుంచి టీఆర్ఎస్ కు కంచుకోట కిందే లెక్క. అదే సమయంలో అక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటల రాజేందర్ కు అక్కడ మరింత పట్టు ఉందని కూడా చెప్పాలి. అయితే ఇప్పుడు ఈటల, టీఆర్ఎస్ వైరి వర్గాలుగా మారిపోయిన నేపథ్యంలో అక్కడి ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారిపోయింది. జనం పల్స్ ను త్వరలో జరగనున్న ఉప ఎన్నిక తేల్చేయనుంది. అందుకే… హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఇక్కడ తన పట్టు నిలుపుకోవాలని ఓ పక్క టీఆర్ఎస్, మరో పక్క ఈటల తమదైన శైలి వ్యూహాలకు పదును పెడుతున్నారు.
నిధులతో ఎంట్రీ ఇచ్చిన మంత్రి గంగుల
ఈ కారణంగానే కాబోలు… హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియకుండానే… అక్కడ ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఈటల ఓ పర్యాయం అక్కడి కొన్ని గ్రామాల్లో పర్యటించి తన సత్తా ఏమిటో నిరూపించే యత్నం చేయగా… ఇప్పుడు ఏకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగించిన చందంగా టీఆర్ఎస్ కీలక అడుగు వేసింది. బుధవారం నాడు హుజూరాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్… నగారా మోగించినంత పని చేశారనే చెప్పాలి. ఇప్పటి నుంచి ఉప ఎన్నిక జరిగేదాకా హుజూరాబాద్ లోనే తిష్ట వేస్తానని ప్రకటించిన గంగుల… హుజూరాబాద్ లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. అంతేకాకుండా వచ్చీ రావడంతోనే ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల మేర నిధులను హుజూరాబాద్ కు విడుదల చేయించుకుని మరీ గంగుల వైరి వర్గంలో పెను కలవరమే సృష్టించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన బిగ్ ఫైట్ మొదలైందనే చెప్పాలి.
Must Read ;- ఈటల,కేసీఆర్ ఇద్దరూ ఒకే గూటి పక్షులు.. మావోయిస్టుల లేఖ