Who Will Be Telangana TDP New President :
తెలుగు దేశం పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ)కి నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. ఐదేళ్ల తరబడి ఆ పదవిలో కొనసాగిన మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా కూడా రమణ ప్రకటించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలో పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న కేడర్ కు అండగా నిలిచే క్రమంలో టీ టీడీపీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని వెనువెంటనే గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు.. ఇప్పటికే కసరత్తు మొదలెట్టేశారు.
చంద్రబాబు సమీక్ష షురూ
శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందన్న కోణంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఆయా నేతల నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఎల్.రమణ పార్టీకి చేసిన ద్రోహం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం.
Who Will Be Telangana TDP New President :
జాబితా ఇదే.. అధ్యక్షుడెవరో?
ఇదిలా ఉంటే.. టీ టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆశావహులు చాలా మందే ఉన్నా.. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలు మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణలో పార్టీ అంతకంతకూ క్షీణిస్తున్న వైనాన్ని చూపుతున్న సీనియర్లు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం లేరని సమాచారం. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు.. టీ టీడీపీ అధ్యక్ష పదవికి కొన్ని పేర్లను పరిశీలిస్తున్ననట్లు సమాచారం. వారిలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరులున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందోనన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- ఎల్.రమణ ఎగ్జిట్ తో టీ టీడీపీకి శని వదిలిందట