గత వారం, పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దవుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలను మంత్రి కేటిఆర్ జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు.
అత్యవసర ప్రాంతాలకు బోట్లు..
ఈరోజు మధ్యాహ్నం కూడా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, ఎస్ఆర్‌నగర్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, వనస్థలిపురం, మీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసినట్లు తెలిసింది. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా బోట్లను పంపించాలని ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. తెలంగాణకు బోట్లు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఈనేపథ్యంలో ఏపీ, తెలంగాణ టూరిజంకి చెందిన పర్యాటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
ఈ బోట్లను హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వద్ద ఉంచినట్లు తెలిసింది. అవసరమైన వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ బోట్లను పంపించనున్నారు. మరోసారి ఈరోజూ ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఆందోళన చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరికొంత మంది నాయకులు పర్యటించి ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిసింది.
మరో ఉపరితల ఆవర్తనం..
బంగాళ ఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నది. రాయలసీమలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు తెలంగాణలోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది. సముద్రం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొన్నది. మత్య్సకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.