కరోనా కారణంగా గతేడాది బోనాల పండుగను నిరాడంబరంగా జరిపామని, కానీ ఈ సంవత్సరం మాత్రం బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్ల పై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సంద్భంగా మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరపుకోవాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. బోనాల పేరిట చందాలు వసూలు చేయకూడదని, ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
అన్ని ఏర్పాట్లు
బోనాలు అనగానే అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుందని, భాగ్యనగరానికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రులు అన్నారు. కరోనా కారణంగా గతేడాది నామమాత్రంగా బోనాలు జరిపామని.. కానీ ఈ సారి మాత్రం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే బోనాలు జరిగే ముఖ్య ప్రాంతాలు, ఆలయాలను ముస్తాబు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రహదారులను శుభ్రత, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇతర శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, హైదరాబాద్ ప్రజలు సహకరించి విజయంవతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. కాగా బోనాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాల జాతరతో భక్తుల రద్దీ పెరుగుతుందని, గ్రేటర్ హైదరాబాద్ ఇప్పటివరకు చాలామంది వ్యాక్సిన్ తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వ్యాక్సిన్ ప్రకియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
తొలిబోనం
వచ్చే నెల 11న గోల్కొండ మహాంకాలి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. అప్పట్నుంచే బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 25న సికింద్రాబాద్ మహంకాళి, 26న రంగం, ఆగస్టు 1 లాల్ దర్వాజ ఆలయం వద్ద బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
Must Read ;- తరలిన తెలంగాణ కేబినెట్.. CJI జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం











