ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. తరువాత తెలుగు తెరను ప్రభావితం చేసిన కథానాయకులుగా కృష్ణ .. శోభన్ బాబు, కృష్ణంరాజు .. కనిపిస్తారు.
ఈ ముగ్గురిలో కృష్ణంరాజు స్థానం ప్రత్యేకం. అందుకు కారణం .. నటుడుగా ఆయన ఎంచుకున్న మార్గం. ఒక వైపున కృష్ణ జేమ్స్ బాండ్ తరహా పాత్రల వైపు వెళుతూ ఉండగా .. మరో వైపున శోభన్ బాబు రొమాంటిక్ పాత్రల వైపు మొగ్గు చూపుతూ వెళుతున్నారు. ఆ సమయంలో గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలలో .. అక్కడి అన్యాయాలను ప్రశ్నించే తిరుగుబాటు నాయకుడి పాత్రలను కృష్ణంరాజు ఎంచుకున్నారు.
‘చిలకా గోరింకా’ సినిమాతో 1960 ద్వితీయార్థంలో తెలుగు తెరకి కృష్ణంరాజు పరిచయమయ్యారు. కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ టచ్ తో కూడిన పాత్రలను ఆయన ఎక్కువగా చేశారు. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ లోను కనిపించారు. అయితే ఆ పాత్రల్లో ఎవరూ కూడా ఆయనను అంతగా పట్టించుకోలేదు. దాంతో ఏ తరహా పాత్రలను ఎంచుకోవాలో .. ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఆయన అయోమయానికి లోనయ్యారు. ఆ ఆలోచనతో ఆయన తన కెరియర్ ను నెట్టుకొస్తూనే 70వ దశకంలోకి అడుగుపెట్టారు.
Must Read ;- తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు!
70వ దశకం ఆరంభంలోనే కృష్ణంరాజుకి ‘కృష్ణవేణి’ .. ‘అమరదీపం’ .. ‘భక్త కన్నప్ప’ వంటి సినిమాలు పడ్డాయి. కృష్ణంరాజుకు తగిన గుర్తింపు లభించడమనేది ఈ సినిమాలతోనే మొదలైంది. ఈ సినిమాల విజయాల తరువాత ఆయన ఆయన చేసిన ‘కటకటాల రుద్రయ్య’ .. ‘మనవూరి పాండవులు’ .. ‘రంగూన్ రౌడీ’ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో తాను ఎలాంటి పాత్రలకు సెట్ అవుతానననే విషయం కృష్ణంరాజుకు అర్థమైంది. ఆయనను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారనే విషయం దర్శక నిర్మాతలకు స్పష్టమైంది.
80 దశకం నాటికే ఆయన తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నారు. నిండైన ఆయన విగ్రహానికి గంభీరమైన వాయిస్ తోడైంది. రౌద్ర రసాన్ని పోషించే సమయంలో చింతనిప్పులుగా మారిపోయే ఆయన కళ్లు అసమానమైన ఆయన నటనకు ప్రతీకలుగా నిలిచాయి. ఈ దశకంలో కృష్ణంరాజు చేసిన అనేక సినిమాలు నటుడిగా ఆయన విశ్వరూపాన్ని చూపించాయి. తెరపై రౌడీయిజాన్ని చూపిస్తూ .. గూండాగిరిని ప్రదర్శిస్తూ, ప్రతినాయకుల గుండెల్లో దడ పుట్టించే పాత్రల్లో కృష్ణంరాజుకు తనకి తిరుగులేదనిపించుకున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన పాత్రలు ఆయనను ‘రెబల్ స్టార్’ గా నిలబెట్టాయి.
ఈ దశకంలో వచ్చిన ‘త్రిశూలం’ .. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ .. ‘తాండ్రపాపారాయుడు’ .. ‘అంతిమ తీర్పు’ సినిమాలు, ఆయనలోని నటుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి .. నటుడిగా కృష్ణంరాజు అంటే ఏమిటనే ప్రశ్నకి నిర్వచనం చెప్పాయి. ఇక 90వ దశకంలోనూ కృష్ణంరాజు తన జోరును కొనసాగించారు. కొత్త తరం కథానాయకుల నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ, తన స్థాయికి తగిన కథానాయకుడి పాత్రలను చేసి మెప్పించారు. ఈ దశకంలో వచ్చిన ‘బావ బావమరిది’ సినిమా, నటుడిగా కృష్ణంరాజులోని రాజసానికి అర్థం చెబుతుంది.
కృష్ణంరాజు .. ఆజానుబాహుడు కావడంతో ఆయన ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకే ఒక నిండుదనం వచ్చేది. తెరపై ఆయనను విలన్ గ్యాంగ్ చుట్టుముడితే అభిమానులు కంగారుపడేవారు కాదు. తమ హీరో వాళ్లను చితగ్గొట్టేస్తాడనే నమ్మకంతో కూల్ గానే కూర్చునేవారు. అందుకు కారణం .. ఆయన పర్సనాలిటీ. స్థిరంగా .. గంభీరంగా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ ఆయన పాత్రలకు ప్రాణం పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక వాణిశ్రీ .. శారద .. జయసుధ .. జయప్రద .. శ్రీదేవి కాబినేషన్లో ఆయన చేసిన సినిమాలు చూస్తే, అందరూ హిట్ పెయిర్ గానే అనిపించడం విశేషం.
అప్పట్లోనే మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి కృష్ణంరాజు ఉత్సాహాన్ని చూపడం విశేషం. జానపద .. చారిత్రక .. పౌరాణిక పాత్రల్లోను ఆయన అద్భుతంగా మెప్పించారు. ఆ పాత్రలను ఆయన తప్ప అంత గొప్పగా ఎవరూ చేయలేరని అనిపించుకున్నారు. నిర్మాతగాను అభిరుచు కలిగిన సినిమాలను నిర్మించారు. ఒక వైపున అడపా దడపా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోను చురుకైన పాత్రను పోషించారు. సామాజిక సేవలో భాగమై తనవంతు కృషి చేశారు. కృష్ణంరాజు ఒక కథానాయకుడిగా ఎంత డీసెంట్ గా వ్యవహరించారో .. రాజకీయనాయకుడిగా కూడా అంతే ఠీవీగా వెలుగొందారు. ఇటు సినిమాల్లోను .. అటు రాజకీయాల్లోను ఆయన రాజసం కలిగిన నాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్బంగా ఆ నటరారాజుకు ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- ఆయన నట భూషణం.. ఆ జీవితం ‘శోభా’యమానం! (శోభన్ బాబు జయంతి నేడు)